Tue Dec 24 2024 12:10:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బాదుడే బాదుడు కాదు.. వీర బాదుడు
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు
వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. కనిగిరిలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ బాధ్యత అని ఆయన అన్నారు. కనిగిరి అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. ఐదేళ్లు అనుభవించిన నరకానికి స్వస్తి పలుకుదామని ఆయన అన్నారు. సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ పాలన రావాలని ఆయన నినదించారు. తెలుగుజాతికి పూర్వ వైభవం వస్తుందని ఆయన అన్నారు. తన హయాంలో హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
వలసలు పెరిగి...
ఉపాధి అవకాశాలు లేక కనిగిరి నుంచి ఎంతో మంది వలసలు పోతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అభివృద్ధి, సంక్షేమం వంటి రెండు కళ్లులాంటివని అన్నారు. జాబ్ రావాలంటే ఇప్పటి నుంచే శ్రమపడి ఈ ప్రభుత్వాన్ని పంపాలని అన్నారు. 2029 నాటికి భారత్ లోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని భావించానని అన్నారు. అయితే అన్నింటినీ నాశనం చేసిన ఈ ప్రభుత్వం యువత ఆశలను దిగజార్చిందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ముద్దులు పెట్టి అధికారంలోకివచ్చి పిడిగుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదని అన్నారు. ఐదుకోట్ల మంది ప్రజలందరూ బాధితులేనని అన్నారు.
విద్యుత్తు ఛార్జీలు పెంచి...
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మామూలు బాదుడు కాదని వీర బాదుడు అంటూ మండి పడ్డారు. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోయాయని అన్నారు. విద్యుత్తు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారన్నారు. తాను హామీ ఇస్తున్నానని, విద్యుత్తు ఛార్జీలు పెంచబోనని చెప్పారు. దోపిడీ కారణంగానే విద్యుత్తు ఛార్జీలు పెరిగాయన్నారు. చివరకు చెత్త మీద కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రి అని అన్నారు. రాజధాని నిర్మించకుండా ఏపీని అన్ని రకాలుగా సర్వనాశనం చేశారని మండి పడ్డారు. ఎక్కువ నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఏపీ అని లెక్కలు చెబుతున్నాయన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి బటన్ నొక్కుతున్నానని అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. బంగారం వంటి రాష్ట్రాన్ని ముప్పయి ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాడని అన్నారు.
Next Story