Thu Dec 19 2024 15:52:23 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పాత సినిమాల్లో నాగభూషణం లాంటోడు ఈ జగన్.. చంద్రబాబు ఫైర్
గుడివాడ సభలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
గుడివాడ సభలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో జరిగిన రా కదిలిరా సభలో ఆయన ప్రసంగించారు. ఇక్కడి నుంచే ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమయిందన్నారు. తడి గుడ్డతో గొంతులు కోసే నాగభూషణం లాంటి విలన్ ఈ ముఖ్యమంత్రి అని చంద్రబాబు అన్నారు. అందరిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. దాడులకు దిగారన్నారు. ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారన్నారు. ప్రతి దానికీ వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. చివరకు తన సొంత చెల్లెలు పైన కూడా కేసులు పెట్టే పరిస్థిితి వచ్చిందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను...
ప్రతిపక్ష నేతలు కూడా ప్రశ్నించడానికి వీలులేని పరిస్థితిని తీసుకు వచ్చారన్నారు. దీంతో పాటు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి సొంత బ్రాండ్లతో మందును జనం చేత తాగిస్తున్నాడన్నారు. జగనన్న బాణం ఇప్పుడు ఎలా తిరిగి వచ్చిందో చూడాలన్నారు. భూభక్షణ చట్టం తీసుకు వచ్చి భూదోపిడీకి పాల్పడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. బాబాయి హత్య కేసులో అసలు నేరస్థులు ఎవరూ ఇంత వరకూ అరెస్ట్ కాలేదన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నయవంచన చేసిన ఈ ముఖ్యమంత్రిని సాగనంపేందుకు యువత నడుంబిగించాలని కోరారు.
అధికారంలోకి రాగానే...
తాము అధికారంలోకి రాగానే వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రేపు వైసీపీ నేతలు ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామ గ్రామాన నిలదీయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బూతులకు, గంజాయి, కేసినోలకు కేంద్రంగా మారిందన్నారు. అహంభావం ఉండే ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా తమ్ముళ్లూ అని చంద్రబాబు ప్రశ్నించారు. రాతియుగం నాటికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారన్నారు. అంతా నటన బూటకం అని చంద్రబాబు మండిపడ్డారు. సంపదను సృష్టించి పేదవాళ్లకు పంచడమే టీడీపీ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. పేదవాడు పేదరికంలో ఉంటే జగన్ సంపన్నుడిగా మారాడన్నారు. మళ్లీ జన్మభూమిని తీసుకువచ్చి ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు.
గేమ్ ఈజ్ ఓవర్...
ఐదేళ్ల నుంచి పదేళ్లలో వికాసం పథకం కింద పేదలందరి బతుకులను మారుస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ ఓడిపోతామని భయంతో అభ్యర్థులను మారుస్తున్నాడన్నారు. ఎప్పుడైతే టీడీపీ, జనసేన కలిసిందో అప్పుడే వైసీపీ నేతల ప్యాంట్లు తడిసిపోయాయన్నారు. గేమ్ ఈజ్ ఓవర్ అని ఆయన అన్నారు. తొంభయి మంది ఎమ్మెల్యేలను మారిస్తే చెత్తను వేరొక చోటకు తరలిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినా అధికారంలోకి వచ్చేది లేదని చంద్రబాబు అన్నారు. వైనాట్ పులివెందుల అని ఆయన ప్రశ్నించారు. బీసీలు ఆదుకునే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు అన్నారు.
Next Story