Tue Nov 05 2024 23:27:33 GMT+0000 (Coordinated Universal Time)
జైలులో.. తొలిరోజు ఇలా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఖైదీగా తొలి రోజు కొంత ఆందోళనతో గడిపారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఖైదీగా తొలి రోజు కొంత ఆందోళనతో గడిపారు. ఆయనను అర్ధరాత్రి జైలులోకి తీసుకు రావడంతో నిద్రలేమితో బాధపడ్డారని చెబుతున్నారు. రాత్రంతా నిద్రలేకుండానే చంద్రబాబు గడిపారని అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ అప్పర్ బ్లాక్ లోని ప్రత్యేక గదిలో ఉంచారు. రాత్రంతా నిద్రపోని చంద్రబాబు టీవీ వార్తలు చూస్తూ గడిపినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం తెలుస్తోంది.
ఆలస్యంగా...
తెల్లవారు జామున నిద్రపోయినపటికీ చంద్రబాబు చాలా సేపటి వరకూ నిద్రపోలేదు. శనివారం తెల్లవారు జామున ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి రెస్ట్ లెస్ గా గడిపారు. నంద్యాలలో అరెస్టయిన చంద్రబాబును ఆయన కోరిక మేరకు రోడ్డు మార్గం ద్వారా తీసుకు రావడంతో సీఐడీ కార్యాలయానికి 9 గంటలు ప్రయాణం చేసి వచ్చారు. అప్పటికే ఆయన అలసి పోయారు. శనివారం రాత్రంతా ఆయనను సీఐడీ అధికారులు స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించిన విచారణ జరిపారు. తెల్లవారు జామున ఆయనకు వైద్య పరీక్షలు జరిపి నేరుగా కోర్టుకు తీసుకెళ్లారు. రాత్రంతా మేలుకుని ఉన్నా ఆయన ఎవరితోనూ మాట్లాడేందుకు సుముఖత చూపలేదని తెలిసింది.
అలసటగా కన్పించడంతో...
దీంతో వరసగా రెండు రోజుల పాటు నిద్రలేక పోవడంతో చంద్రబాబు అలసటగా కనిపించారని సిబ్బంది చెబుతున్నారు. అందుకే ఆయన ఆలస్యంగా నిద్రలేచారంటున్నారు. ప్రతిరోజూ తెల్లవారు జామున నిద్రలేచి యోగా, చిన్న పాటి వ్యాయామం చేేసే చంద్రబాబు తొలి రోజు మాత్రం జైలులో పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన నిద్రలేచిన వెంటనే అందుబాటులో న్యూస్ పేపర్లను కూడా కొన్నింటిని జైలు అధికారులు ఉంచినట్లు తెలిసింది. నలభై పదుల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు తొలిరోజు జైలు జీవితం ఇలా గడిచింది.
Next Story