Thu Dec 26 2024 12:08:59 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Cabinet : వాళ్లకు కేబినెట్ లో ఛాన్స్ లేదా.. సమీకరణాలు.. సంకేతాలు మాత్రం అదే చెబుతున్నాయిగా
ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన జనసేన, బీజేపీ నేతలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. బీజేపీకి రెండు, జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ అధినేతలు ప్రకటించిన వారికే కేబినెట్ లో చోటు కల్పించనున్నారు. అయితే సీనియారిటీ, సామాజికవర్గం, సిన్సియారిటీని చూసి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ప్రాంతాల వారీగా కూడా సమతుల్యత పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
గతంలో పార్టీ మారి వచ్చి...
అయితే ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి గెలిచి కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో ఎవరికి చోటు దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతుంది. 2014 లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలలో 23 మంది టీడీపీలో చేరారు. వారిలో భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు ఉన్నారు. వీరిలో ముగ్గురు రెడ్డి సామాజికవర్గం నేతలు. సుజయ కృష్ణరంగారావు ఈసారి బొబ్బిలి నుంచి పోటీ చేయలేదు. ఆయన సోదరుడు బేబినాయనకు టిక్కెట్ ఇవ్వడంతో ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరి ప్రస్తుతం జమ్మల మడుగు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అమర్నాధ్ రెడ్డి పలమనేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజుల కోటాలో...
వీరు నలుగురిలో విజయనగరం జిల్లా నుంచి రాజుల తరుపున బేబినాయనకు అవకాశం ఇస్తారా? లేక ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన రఘురామ కృష్ణరాజుకు ఛాన్స్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రఘురామ కృష్ణరాజును కేబినెట్ లోకి తీసుకుంటే బేబినాయనకు అవకాశం ఉండకపోవచ్చు. ఇక అమర్నాధ్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ చిత్తూరు జిల్లాలోని పీలేరు నుంచి గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. నల్లారికి కనుక కేబినెట్ లో అవకాశం కల్పిస్తే అదే జిల్లా నుంచి అమర్నాధ్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోక పోవచ్చని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.
అఖిలకు అంతా అడ్డంకే...
ఇక మంత్రి అఖిలప్రియ విషయంలో ఈసారి కొంత మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు ఆలోచనలో పడొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి హేమాహేమీలు గెలిచారు. అందులో రెడ్డి సామాజికవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ నుంచి విజయం సాధించారు. అదే సమయంలో పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి కూడా గెలుపొందారు. మరో వైపు నంద్యాల నుంచి ఎన్ఎండీ ఫరూక్ కూడా గెలుపొందడంతో ఏ రకంగా చూసినా అఖిలప్రియను కేబినెట్ లో తీసుకునే అవకాశాలు మాత్రం లేవు. ఆదినారాయణ రెడ్డిని మాత్రం బీజేపీ సిఫార్సు చేస్తేనే కేబినెట్ లోకి తీసుకుంటారు. లేకుంటే అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. మొత్తం మీద గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో వైసీపీ నుంచి గెలిచిన ఆ నలుగురిలో కేబినెట్ లో చోటు దక్కడం ఈసారి కష్టంగానే ఉంది.
Next Story