Thu Dec 19 2024 17:51:54 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వందకు వంద శాతం గెలుపు మనదే.. ఇది ఫిక్స్
రానున్న ఎన్నికల్లో గెలుపు కూటమిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వందకు వంద శాతం మనదే గెలుపు అని అన్నారు
రానున్న ఎన్నికల్లో గెలుపు కూటమిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వందకు వంద శాతం మనదే గెలుపు అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రజాగళం సభలో ప్రసంగించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ప్రజలను చైతన్యపర్చాలని తాను వస్తే.. తననే ప్రజలు చైతన్యపరుస్తున్నారని చెప్పారు. జగన్ దోపిడీకి తెరపడాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఐదేళ్లుగా ప్రజలను దోచుకుని తినడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. అడ్డంగా దోపిడీకి పాల్పడ్డారని, జగన్ ధనదాహానికి అంతులేకుండా పోయిందన్నారు.
అడ్డంగా దోచుకుని...
ఇసుక నుంచి మద్యం వరకూ అన్ని రకాలుగా ప్రజలను పిండి మరీ దోచుకున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా విద్యుత్తు ఛార్జీలను పెంచలేదని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో తొమ్మిదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచి నడ్డి విరిచారన్నారు. ఎన్నడూ లేని విధంగా చెత్త పన్నును కూడా వేసి ప్రజలను దోచుకున్నాడని అన్నారు. జగన్ ను ఇంటికి పంపే సమయం ఆసన్నమయిందని అన్నారు. మరో నెల రోజులు ఓపిక పడితే నరకాసుర పాలన నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. ఇప్పుడు ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎన్నికల కమిషన్ అండగా ఉంటుందని, అన్యాయం జరిగితే రోడ్డుపైకి వచ్చి పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి...
ిపిచ్చి పిచ్చి మద్యం బ్రాండ్లు తీసుకుని వచ్చి మహిళల నుదుట మీద కుంకుమను తొలగించిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే మంచి బ్రాండ్లు తెచ్చి, మద్యం ధరలను కూడా తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి నెల ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయలు పింఛనును అందచేస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పేరిట ప్రతి కుటుంబంలో ఒక ఆడిబిడ్డకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. అలాగే మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలు ఈ దుర్గార్మ పాలన నుంచి బయటపడేసేందుకు కూటమికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపు నిచ్చారు.
ప్రశాంతమైన కోనసీమలో...
కోనసీమ ప్రశాంతతకు మారుపేరని, టీడీపీ హయాంలో ఎప్పుడైనా హింస జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు అని అన్నారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం పీడ విరగడవ్వడం ఖాయమని అన్నారు. ముప్ఫయి ఏళ్లు వెనకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే మూడు పార్టీలూ కూటమిగా ఏర్పడ్డామని చంద్రబాబు తెలిపారు. తమ కూటమిని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. జగన్ ప్రభుత్వాన్ని పారదోలేందుకు ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ సహకారంతో వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదనే కూటమిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
Next Story