Thu Nov 28 2024 06:47:42 GMT+0000 (Coordinated Universal Time)
అందరం కలిసి పోరాడాల్సిందే.. సానుభూతి ప్రకటించడానికే వచ్చా
విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పై ప్రభుత్వం చేసిన చర్యలను తాను ఖండించానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు
విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పై ప్రభుత్వం చేసిన చర్యలను తాను ఖండించానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అయితే తాను పవన్ ను కలిసి ఆయనతో మాట్లాడాలని మాత్రమే వచ్చానని చంద్రబాబు తెలిపారు. సానుభూతి వ్యక్తం చేయడానికే వచ్చానని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హోటల్ కు వచ్చానని తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి వస్తూ తాను కలుస్తానని మెసేజ్ పెట్టానని, అందుకు పవన్ అంగీకరించారన్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు వ్వవహరించిన తీరు సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
తప్పుడు కేసులు పెట్టి...
ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయాలని చూస్తున్నారన్నారు. దాడులు చేయడం, కేసులు పెట్టడం, మళ్లీ నిందలు వేయడం చేయడమే వైసీపీ పని అని అన్నారు. వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారన్నారు. గతంలో తన పట్ల కూడా ఇలానే వ్యవహరించారన్నారు. నలభై సంవత్సరాలుగా ఎన్నడూ చూడని రాజకీయాలు తాను నేడు చూస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం బాధలు తట్టుకోలేక, హింసను భరించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థిితి వచ్చిందన్నారు. అందుకే మనసు బాధపడి ఆయనకు సంఘీభావం తెలియజేయాలని వచ్చానని చంద్రబాబు తెలిపారు.
రాజకీయ పార్టీలన్నీ...
వైసీపీ లాంటి నీచమైన పార్టీని తాను ఇంత వరకూ చూడలేదన్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేసి ఇంతవరకూ కేసు పెట్టలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒకటే కోరుతున్నానని, ముందు పార్టీల మనుగడకు పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ మీటింగ్ పెడితే తప్పా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కు ఇలాంటి ఆనందాలు శాశ్వతం కాదని అన్నారు. అవసరమైతే మళ్లీ కలుస్తామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని చంద్రబాబు కోరారు. ప్రతిపక్ష నేతలు బయటకు వస్తే ఆంక్షలా? అని ఆయన ప్రశ్నించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు.
శాంతిభద్రతలు ఉన్నాయా?
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు అందరం చేద్దామని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కలసి రావాల్సి ఉందన్నారు. ప్రజాసమస్యలపై అడుగుతామని, నిలదీస్తామని, మెడలు వంచుతామని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు. అవసరమైతే మరికొన్ని సార్లు సమావేశమై చర్చించుకుని ముందుకు వెళదామని చంద్రబాబు అన్నారు. తిరుపతి ఎయిర్పోర్టు నుంచి తనను వెనక్కు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Next Story