Fri Dec 20 2024 12:30:12 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేను అహర్నిశలూ జనం కోసం... జగన్ మాత్రం మోసాలు చేయడం కోసం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఇక కోలుకోలేదన్నారు. ఇప్పటికే ముప్పయి ఏళ్లు రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయిందన్న చంద్రబాబు మరోసారి ఆ తప్పు చేయవద్దు అని పిలుపు నిచ్చారు. సర్వేపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. జగన్ మోసం చేసే వ్యక్తి అని, తన తల్లిని, చెల్లిని మోసం చేశారని, ప్రజలను ఎందుకు మోసం చేయరని ఆయన ప్రశ్నించారు.
ఇంటికి పంపితేనే...
తల్లిని, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అవినీతి పరులను ఇంటికి పంపాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో క్లాస్ వార్ కాదని, క్యాష్ వార్ నడుస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ లోకే వెళుతుందని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి అనేది జగన్ పాలనలో అస్సలు కనిపించిందా? అంటూ ప్రశ్నించారు. కోర్టుల్లో ఫైళ్లను కాజేసిన వ్యక్తి కాకాణి అని, ఈసారి అతనిని ఓడించ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువత కు ఇక ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదన్నారు.
సూపర్ సిక్స్ హామీలు...
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి అందిస్తామని తెలిపారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం అందుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎక్కడకు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేలా తాను చర్యలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలనూ కలిశామని చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రం కోసమే చేతులు కలిపాడని ఆయన అన్నారు. నా అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి వైపు పయనించేలా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
Next Story