Mon Dec 23 2024 07:53:31 GMT+0000 (Coordinated Universal Time)
చీకటి జీవో వెనక్కు తీసుకోవాల్సిందే
చీకటీ జీవోను తెచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
చీకటీ జీవోను తెచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పు పై గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేశామని తెలిపారు. గవర్నర్ తో కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకు రావాలని 1986లో హెల్త్ యూనివర్సిటీని తెచ్చారన్నారు. తాను 1998లో ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టానని తెలిపారు. వైద్యరంగంలో సంస్కరణలు తెచ్చిన ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. 24 ఏళ్ల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకుని వైద్యులుగా స్థిరపడ్డారన్నారు. 18 కళాశాలలు తెలుగుదేశం హయాంలో వచ్చాయన్నారు. వైద్యరంగానికి ఎనలేని సేవలను టీడీపీ అందించిందన్నారు.
అన్నీ అబద్ధాలే...
నిన్న ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పేటప్పుడు బాధ్యతగా చెప్పాలన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి అబద్దాల కోరుగా తయారయ్యారన్నారు. ఎయిమ్స్ ను కూడా తామే తెచ్చామని తెలిపారు. ఎయిమ్స్ కు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడన్నారు. ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ కు రాజశేఖర్ రెడ్డికి ఏం పోలిక ఉందన్నారు. ఎన్టీఆర్ కంటే వైఎస్ ఏ రకంగా గొప్పోడు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో పేరు తీసేస్తావా? అని చంద్రబాబు జగన్ ను నిలదీశారు.
పిచ్చివాళ్లు చేసే పని...
గవర్నర్ యూనివర్సిటీకి ఛాన్సిలర్ కాబట్టి ఆయన ముందు ఈ విషయాన్ని పెట్టామన్నారు. పేర్లు ఉన్నపళంగా మార్చడమనేది పిచ్చి వాళ్లు చేసే పని అని అన్నారు. ఎన్టీఆర్ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టేంత వరకూ తమ పోరాటం ఆగదన్నారు. నీ తండ్రి, నువ్వు ఎన్ని వైద్య కళాశాలలో ఇచ్చారో తెలుసుకో అని జగన్ ను అన్నారు. వైసీపీ నేతలు కళ్లుండి కబోదులుగా తయారు కావద్దని చంద్రబాబు హితవు పలికారు. వైద్య వ్యవస్థను, ఆసుపత్రులను పూర్తిగా భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండి పడ్డారు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని చంద్రబాబు అన్నారు. ఈ ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేదన్నారు. చెన్నారెడ్డిపై పోరాడిన తర్వాత ఆయన పేరు మీద ట్రైనింగ్ సెంటర్ కట్టించానని తెలిపారు. విజయభాస్కర్ రెడ్డి పేరిట స్టేడియం నిర్మించానని తెలిపారు. వైఎస్ షర్మిలే స్వయంగా సబబు కాదని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ బిల్లును తిరస్కరించాలని గవర్నర్ ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని తీసుకెళతామని చెప్పారు.
Next Story