Sun Dec 22 2024 23:23:49 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అంత సులువా బాబయ్యా.. ముళ్ల మీద నడవాల్సిందేనా? సీనియర్లకు చోటేదీ?
ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలన అంత సులువుగా సాగేలా కనిపించడం లేదు
ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలన అంత సులువుగా సాగేలా కనిపించడం లేదు. ఎన్నో హర్డిల్స్ చంద్రబాబు ముందున్నాయి. ఇక పాలనపరమైన సమస్యలయితే.. రెండోది ఆర్థిక సమస్యలు. మరొకటి.. అసలైన ఇబ్బంది ఫైనాన్స్. ఇలా మూడు రకాలుగా చంద్రబాబు ముందు సవాళ్లున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో సమస్యలు చంద్రబాబుకు స్వాగతం చెబుతున్నాయి. చంద్రబాబు చెబుతున్నట్లు రాష్ట్రం ముప్పయి ఏళ్లు వెనక్కు పోయిందని అంటున్నట్లు.. గాడిన పడేయటానికి ఈ టర్మ్ బహుశా సరిపోక పోవచ్చు. అయినా ఆయనకున్న అనుభవంతో వీటిని దాటటానికే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండొచ్చు.
సమన్వయం కూడా...
ఒకటి.. పార్టీల మధ్య సమన్వయం.. కూటమిలోని మూడు పార్టీల నేతలను సంతృప్తి పర్చాలంటే సాధ్యమయ్యే పనికాదు. సొంతంగా మెజారిటీ ఉన్నప్పటికీ ఇటు జనసేన, అటు బీజేపీతో సయోధ్యతతోనే ముందుకు సాగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా పొరపొచ్చాలు బయటపడి పార్టీ ప్రజల్లో ముందుగానే ఇబ్బందుల పాలవుతుంది. ముఖ్యంగా పదవుల పంపకం ఆయన ఎదుట పెద్ద సవాలే. మంత్రివర్గంలో చోటు కల్పించడం కత్తిమీద సామే అవుతుంది. ఎందుకంటే మూడు పార్టీల నేతల్లోనూ సామాజికవర్గాల సమతూకం పాటించాలి. టీడీపీలో సీనియర్లు చాలా మంది గెలిచారు. వారంతా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరిని మరోసారి త్యాగం చేయాలని కోరాల్సి ఉంటుంది. 24 మందిలో పదిహేడు మందికి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే సీనియర్లలో తమకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఉంది.
ఎనిమిది జిల్లాల్లో...
ముఖ్యంగా సీనియర్ నేతలను సంతృప్తి పర్చడం అంటే.. గత ఐదేళ్లలో పార్టీకి అండగా నిలబడిన వారికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. గత ఎన్నికలలో గెలిచిన 23 మందిలో నలుగురు వెళ్లినా 18 మంది ఆయన వెంట ఉన్నారు. వారిలో అధిక శాతం మందికి పదవులు ఇవ్వాల్సి ఉండగా దానిని పెద్దగా పాటించలేదు. వారు కూడా అదే హోప్ లో ఉన్నారు. కష్టకాలంలో నమ్ముకున్న తమకు అన్యాయం చేయరని వారు భావిస్తున్నారు. టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కన్నా లక్ష్మీనారాయణ వంటి వాళ్లకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలి. ఇలా అనేక రకాల సమస్యలున్నాయి. అందుకే సొంత పార్టీ నేతలను మంత్రి పదవుల ద్వారా సంతృప్తి పర్చడం అంత ఆషామాషీ కాదు. ఎనిమిది జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీలో ఎందరో సీనియర్ నేతలు బుగ్గకారు కోసం వేచి చూస్తున్నారు.గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు వంటి వారిని పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఇచ్చిన హామీలు...
ఇక మరో ప్రధాన సమస్య ఇచ్చిన హామీలు నెరవేర్చడం..జులై నెల నుంచే మూడు నెలల పింఛను నాలుగు వేలరూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మే, జూన్ నెలకు కలిపి జులై నెలలో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు పింఛను చెల్లించాలి. ఇక మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఖజానాకు ఇది భారంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభమం కావంతో తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే లక్షల కోట్ల నిధులు అవసరం. అయితే కొద్దోగొప్పో కేంద్రంలో తమ మీద బీజేపీ ఆధారపడి ఉండటం గుడ్డిలో మెల్ల అయినా కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందన్నది చూడాల్సి ఉంది. మరి చంద్రబాబు వీటన్నింటినీ ఎలా అధిగమిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story