Sun Nov 17 2024 22:13:56 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వైపు వెళ్లకండి
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగునున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరు కానున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దాదాపు రెండు లక్షల మంది కూర్చుని ప్రమాణ స్వీకారాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు పథ్నాలుగు ఎకరాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రేపు ఉదయం 11.27 నిమిషాలకు నిర్ణయించిన ముహూర్తానికి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రధాని రాకతో...
గన్నవరం ఎయిర్ పోర్టు ప్రధాన గేటు నుంచి కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఈ సభను ఏర్పాటు చేశారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పది వేల మంది పోలీసులలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాని రాక సందర్భంగా పలు భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని రేపు ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం జరిగే వేదికకు వెళ్లనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు...
ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం నుంచి 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి భువనేశ్వర్ చేరుకుంటారు. ఒడిశాలోనూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ నుంచి గన్నవరం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. కేవలం ప్రమాణ స్వీకారానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. రేపు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ బెంజి సర్కిల్ నుంచి కంకిపాడు మీదుగా పామర్రు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు మళ్లిస్తారు. విజయవాడ బయటే ఈ వాహనాలను దారి మళ్లించనున్నారు.
Next Story