ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. స్పష్టంగా కనిపిస్తోంది.. చంద్రబాబు
జిల్లాల పర్యటనపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన తెలుగు తమ్ముళ్లతో జోష్ నింపింది. ఏడు జిల్లాల్లో సాగిన చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అధినేతకు ఘన స్వాగతం పలికారు. జనం భారీగా తరలిరావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జగన్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. తరలివస్తున్న జనసందోహమే అందుకు నిదర్శనమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు.
తన మూడు రోజుల జిల్లాల పర్యటనపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. తన జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగిందన్నారు. ఏడు జిల్లాల్లోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువయ్యామన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ 'బాదుడే బాదుడు' పై ప్రజల అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. అది స్పష్టంగా కనిపించిందని చంద్రబాబు చెప్పారు. తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పై ఆసక్తి... రానున్న మార్పును సూచిస్తున్నాయన్నారు. వాడవాడలా వెల్లువలా కదిలివచ్చారని.. అర్ధరాత్రి సైతం ఎదురొచ్చి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఈ పర్యటనకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి ఓ సందేశం ఇచ్చిందని చంద్రబాబు ట్వీట్ చేశారు.