Fri Dec 20 2024 12:46:20 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఆ ఒక్క మంత్రి పదవిని చంద్రబాబు ఖాళీగా ఉంచింది ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంత్రిపదవులన్నీ చంద్రబాబు భర్తీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంత్రిపదవులన్నీ చంద్రబాబు భర్తీ చేశారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి మంత్రి పదవి ఇచ్చారు. మిగిలిన మంత్రి పదవులన్నీ టీడీపీ తీసుకుంది. కూటమిలో లెక్కల ప్రకారమే మంత్రి పదవుల పంపిణీ జరిగింది. మిత్రపక్షాల నుంచి కూడా పెద్దగా వత్తిడి ఏం లేకపోవడంతో చంద్రబాబు తన కేబినెట్ ను స్వేచ్ఛగానే ఏర్పాటు చేయగలిగారు. అంతా కొత్తవారితో మంత్రివర్గాన్ని నింపారు. చంద్రబాబు మంత్రి వర్గంలో దాదాపు 17 మంది కొత్త వారే. గతంలో మంత్రి పదవులు చేపట్టని వారు మాత్రమే ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారధి, ఎన్ఎండీ ఫరూక్, లోకేష్ తప్ప మిగిలిన మంత్రులంతా తొలిసారి కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారే.
అందరికీ అవకాశం ఇచ్చి...
ముగ్గురు మహిళలకు ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు బీసీలు ఎనిమిది మందికి, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం ఒకరు, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం లభించింది. నలుగురు కాపు, కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజికవర్గం నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే క్షత్రియ సామాజికవర్గం నుంచి దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచినా ఒక్కరికీ కేబినెట్ లో చోటు కల్పించలేదు. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఎవరూ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టిన చంద్రబాబు యువకులకు అవకాశం ఇచ్చి ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఒక్క స్థానం మాత్రం ఖాళీగా ఉంచడం పార్టీలో చర్చనీయాంశమైంది.
మండలి నుంచి...
కానీ ఆ ఒక్క స్థానం శాసనమండలి నుంచి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రచారం అయితే పార్టీలో బాగా నడుస్తుంది. ఇక శాసనమండలిలో ఖాళీ అయ్యే ప్రతి స్థానం కూటమికే దక్కనుంది. శాసనమండలిలో త్వరలో ఖాళీ అయ్యే స్థానాలకు ముఖ్యమైన నేతలను తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో తనకు అండగా ఉన్న నేతలతో పాటు పార్టీకి భవిష్యత్ లో ఉపయోగపడే సామాజికవర్గం నేతలను మాత్రమే ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని నిర్ణయించారని తెలిసింది. పాత కృష్ణా జిల్లాకు చెందిన ఒక యువనేత పేరు ప్రచారంలో బాగా వినపడుతుంది. ఆయనను ఎమ్మెల్సీగా చేసి, మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
టీడీపీ నేతకే...
మరోవైపు కూటమిలో భాగంగా తన టిక్కెట్ ను త్యాగం చేసి మిత్రపక్ష నేత విజయానికి తోడ్పడిన వారి పేరు కూడా పార్టీలో బలంగా వినిపిస్తుంది. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ సామాజికవర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలిసింది. జనసేనకు మూడు కంటే ఎక్కువ స్థానాలు అది కోరడం లేదు. అలాగే బీజేపీ కూడా ఒకటికి మించి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాల్సిన పనిలేదన్న అభిప్రాయంలో ఏపీసీఎం ఉన్నారని తెలిసింది. ఆ ఒక్కటీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే దక్కుతుందని, వారిలో కృష్ణా, తూర్పు గోదావరి జిల్లా నేతల పేర్లు వినపడుతున్నాయని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story