Fri Nov 22 2024 19:46:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ బంద్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ నేడు నిరసన కార్యక్రమాలకు దిగనుంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ అధినేతపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను పటిష్ట బందోబస్తు మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలును తరలించిన సంగతి తెలిసిందే.
భారీ బందోబస్తు...
టీడీపీ, జనసేన బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఎలాంటి నిరసనలకు, ర్యాలీలకు అనుమతి లేదని ప్రకటించారు. 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను గృహనిర్బంధంలో ఉంచారు . ఉత్తర కోస్తా ప్రాంతంలోని పలు పాఠశాలలను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రత్యేక పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎలాంటి అవస్థలు పడకుండా పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేశారు.
జనసేన మద్దతుతో...
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ కు జనసేన కూడా మద్దతు పలికింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని భావించిన పోలీసులు ఆ ప్రాంతంలో పెద్దయెత్తున పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను రప్పించారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తం మీద ఏపీీలో ప్రారంభమైన బంద్ ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. అనేక మంది టీడీపీ కార్యకర్తలను ఇప్పటికే పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Next Story