''ఇది అరాచక పాలనకు నిదర్శనం'': అచ్చెన్న
అధికార పార్టీ వైసీపీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ దురాగతాలకు అడ్డూ,
ఆంధ్రప్రదేశ్: అధికార పార్టీ వైసీపీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ దురాగతాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు కరువయ్యాయని అన్నారు. మొన్న నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై, నిన్న కొండేపిలో బాలవీరాంజనేయ స్వామిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ అరాచకాలకు అడ్డు గోడ లేకుండా పోయిందని ఆరోపించారు. టంగుటూరులో తెలుగు దేశం పార్టీ నాయకుడు సుధాకర్.. పార్టీలో చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడని ఆయన భార్యను ట్రాక్టర్‌తో తొక్కించి మరీ చంపేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరంలో టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డిపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన జెడ్పీటీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమన్న అచ్చెన్నాయుడు.. రాష్ట్రంలో ప్రజలపై, ప్రతిపక్షాలపై దాడులు జరుగుతుంటే జగన్ రెడ్డి చూసి సంతోషించడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. పోలీసులు శాంతి భద్రతలను కాపాడకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ రౌడీలను కట్టడి చేయకుండా, వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షనేతలపై వైసీపీ గూండాల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్నా అన్నారు.
జయరామిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే.. దానికి జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జయరామిరెడ్డిపై దాడికి పాల్పడ్డ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు.. వైసీపీ నాలుగేళ్ల పాలనతో యువతకు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను పక్కన పెట్టి, సొంత పత్రిక క్యాలెండర్‌ను సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోలో యువతకు భరోసా కల్పించామని అన్నారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసగించారని, డీఎస్సీ, పోలీస్, ఇతర పోస్టుల భర్తీకి నియమకాలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వైసీపీ శ్రేణుల్లో వణుకు ప్రారంభమైందన్నారు.