పరువు కొనుక్కునే పనిలో బాలినేని.. సీనియర్ నేత ఘాటు కామెంట్స్
శ్రీలంక ఆర్థిక సంక్షోభం కారణంగా జిల్లాలో ఉన్నాడే కానీ.. లేకుంటే ప్రత్యర్థులను పేకాడేసేవాడంటూ విమర్శలు చేశారు అయ్యన్న.
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో వ్యవహారం హీట్ రాజేస్తూనే ఉంటుంది. జగన్ సర్కార్ పీఠమెక్కిన తొలినాళ్లలో ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు.. మంత్రుల తొలగింపు వరకూ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో అధికార, విపక్షాల నడుమ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లు కూడా పదవులు కోల్పోవడం టీడీపీ నేతలకు అస్త్రంగా మారింది.
పదవి కోల్పోయిన మంత్రులను మరింత టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఛీ పొమ్మని జగన్ రెడ్డి పదవిలో నుంచి పీకేశారని.. ఇక జిల్లాలో ఎవరూ తనకు నమస్కారం పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో పరువు కొనుక్కునే పనిలో పడ్డాడంటూ ఎద్దేవా చేశారు.
పదవి పోయినా జిల్లాలో అడుగుపెడుతున్నా కార్లు పెట్టమని అడుక్కోవడం.. నేను లేస్తే మనిషిని కాదంటూ ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చే ఎలివేషన్లు అన్నీ ఉనికి కాపాడుకోవడానికేనంటూ అయ్యన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాలినేనికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ నిట్టూర్చారు. శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం కారణంగా జిల్లాలో ఉన్నాడే కానీ లేకుంటే శ్రీలంకలో ప్రత్యర్థులను పేకాడేసేవాడేనంటూ సెటైర్లు పేల్చారు.