లోకేష్ టార్గెట్ పోసాని.. నేడు వాంగ్మూలం
పోసాని కృష్ణమురళి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు
నటుడు, దర్శకుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి టీడీపీ మీద, టీడీపీ అధినేత మీద భారీగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడును, ఆయన కుమారుడిని అసలు నమ్మకండంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరో వైపు తన మీద ఇష్టానుసారం మాట్లాడితే ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కిస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అంటున్నారు. ఇప్పటికే పలువురిపై కోర్టుకు ఎక్కారు, తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలపై న్యాయపోరాటం ప్రారంభించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనకి అవినీతి బురద అంటించాలని చూశారంటూ సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి పైనా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం నేడు మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టుకి లోకేశ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రకి ఒక రోజు విరామం ప్రకటించారు.