ఆదాయం తగ్గలేదు.. కానీ జీతాలు ఇవ్వట్లేదు.. ఎమ్మెల్సీ అశోక్బాబు ఫైర్
ఏడో తేదీ వచ్చినా జీతాలు చెల్లించకపోవడమేంటని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
నేటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పులు ఇస్తే కానీ జగన్ సర్కార్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఏడో తేదీ వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాలేదని.. ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అప్పుల కోసం బిజీబిజీగా తిరుగుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన తక్షణమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనాను బూచిగా చూపుతూ రాష్ట్ర ఆదాయం తగ్గిందని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని అశోక్బాబు విమర్శించారు. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాలకు ఆదాయం తగ్గినా.. ఏపీకి ఆదాయం తగ్గలేదన్నారు. జీఎస్టీ చెల్లింపులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా పెరిగాయన్నారు. గత రెండేళ్లలో జీఎస్టీ ఆదాయం, వ్యాట్, కేంద్రం నిధులతో ఆదాయం బాగా పెరిగిందని.. అయినా జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. చాలా రాష్ట్రాలకు కరోనాతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు, జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు లేవని చెప్పారు.
ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ ఆ సొమ్మంతా ఎటు పోతుందో చెప్పకుండా ప్రభుత్వం ఆటలాడుకుంటోందని అశోక్బాబు అన్నారు. ప్లాన్ ప్రకారమే రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచిందని.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే వయస్సు పెంచారని ఆయన ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల్లోనూ కోతలు పెడుతున్నారని.. అర్హులను పథకాలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఒకటో తేదీన ఉద్యోగులకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడేవని ఆయన అన్నారు. చెత్తపన్ను కట్టనందుకు ఇళ్ల ముందు చెత్తవేయించిన జగన్ సర్కార్.. ఇప్పుడు జీతాలు చెల్లించనందుకు ఆయన ఇంటి ముందు చెత్తవేయాలా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.