Tue Nov 05 2024 19:47:45 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల అదుపులో యశ్ బొద్దులూరి
టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు శంషాబాద్
టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికే అరెస్ట్ చేసి మంగళగిరి తరలించారు. అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యశ్ శంషాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అక్రమ అరెస్టుని ఖండిస్తోంద్నారు.న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలను మాత్రం వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
యశ్ అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎన్ఆర్ఐ యశ్ బొద్దులూరిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ కేసుల్లో అన్యాయంగా అరెస్ట్ చేయడం గురించి తెలిసి షాకయ్యానన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు. ఓ టెర్రరిస్టులా అతడ్ని విదేశాల నుంచి వచ్చీ రాగానే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అతడికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. "జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను ఎండగడుతున్న ఎన్ఆర్ఐ యష్ బొద్దులూరిని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యష్‌ని శంషాబాద్ లో నిర్బంధించిన ఏపీ సీఐడీ. తెలుగుదేశం పార్టీ అక్రమ అరెస్టుని ఖండిస్తోంది. నీ సైకో చేష్టలు మరొక్క వంద రోజులే జగన్ రెడ్డి. అట్టుకి, అట్టున్నర తిరిగి ఇచ్చేస్తాం." అంటూ టీడీపీ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది.
యశ్ అరెస్ట్ ను టీడీపీ కీలక ఎన్నారై నేత కోమటి జయరాం తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ చివరి వంద రోజులన్నా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమోనని ఆశించామని, కానీ తన వక్ర బుద్ధిని కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రవాసాంధ్రుల ఆశలను వైసీపీ ప్రభుత్వం వమ్ము చేస్తోందని అన్నారు. యశ్ అక్రమ అరెస్ట్ ను అమెరికాలో ఉన్న ఎన్నారైలు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. యశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Next Story