Mon Dec 23 2024 08:25:12 GMT+0000 (Coordinated Universal Time)
'రా... కదలిరా'.. అంటున్న టీడీపీ.. షెడ్యూల్ ఇదే!!
జనవరి 5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనవరి 5వ తేదీన
టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్ కార్యక్రమాలపై అచ్చెన్నాయుడు వివరించారు. ఈ కార్యాలయంలో ప్రత్యేక లోగో కనిపించింది. చంద్రబాబు బొమ్మతో 'రా... కదలిరా' పేరిట ఏర్పాటు చేసిన పోస్టర్లలో టీడీపీ సైకిల్, జనసేన గ్లాసు పక్కపక్కనే కనిపించాయి.
జనవరి 5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. జనవరి 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రోజుకి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. సభలకు తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నామని.. 1982లో టీడీపీ ఆవిర్భవించక ముందు ఉన్న పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులు నేడు రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాలంటే చంద్రబాబునాయుడి నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం టీడీపీతోనే సాధ్యం.. ఏపీ ఒక నూతన నవోదయం చూసేందుకు టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
జనవరి 5: ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో సభ
జనవరి 6: విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంట.
జనవరి 9: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ.
జనవరి 10: విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని.
జనవరి 18: తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్థంతి నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీస్థాయిలో సభ
జనవరి 19: చిత్తూరు పార్లెమంట్ పరిధిలోని జీడీ నెల్లూరు, కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురం
జనవరి 20: అరకు పార్లమెంట్ పరిధిలోని అరకులో, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట
జనవరి 24: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉవరకొండలో సభ
జనవరి 25: నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలో
జనవరి 27: రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ లోని పొన్నూరు అసెంబ్లీలో
జనవరి 28: అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో
జనవరి 29: ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు
Next Story