Thu Dec 26 2024 12:56:47 GMT+0000 (Coordinated Universal Time)
Achennaidu : అచ్చెన్నాయుడు రాజకీయంగా వైదొలిగే టైం వచ్చేసిందా? అందుకే ఆ నిర్ణయమా?
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని, ఆయన వారసుడి ఎంట్రీకి సిద్దం చేశారని చెబుతున్నారు
తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు క్రమంగా సీనియర్ నేతలకు అర్ధమవుతున్నాయి. ఒకవైపు జరుగుతున్న పరిణామాలతో ముందు జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది సీనియర్లు పార్టీ లో ఫేడ్ అవుట్ అయ్యారు. కేబినెట్ కూర్పులోనే ఈ విషయం స్పష్టమయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పటికీ.. చినబాబు నారా లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి మంత్రి వర్గం విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఏది చూసినా లోకేష్ ముద్ర కనిపిస్తుంది. సీనియర్లు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు.
సీనియారిటీ ముద్ర...
కుటుంబ నేపథ్యం, పార్టీలో వారికున్న ట్రాక్ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. సీనియర్ నేతలు అనే ముద్రతో పంపించి వేస్తున్నారు. కొందరు వారంతట వారే స్వచ్ఛందంగా తప్పుకుంటుండగా, మరికొందరు నేతలు మాత్రం ఇంకొంత కాలం వెయిట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. మరికొందరు మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాము రాజకీయాల్లో నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటకే కేఈ కృష్ణమూర్తి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుని ఆయన తన వారసుడైన శ్యాంబాబుకు బాధ్యతలను అప్పగించారు. ిఇప్పడు అదే బాటలో ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అచ్చెన్నాయుడు కూడా అదే పనిలో ఉన్నారని అర్థమవుతుంది. ఆయనకూడా పార్టీలో జరుగుతున్న పరిణామ క్రమాలు అర్థమవుతున్నాయి.
టిక్కెట్ దొరకకపోయినా...
వచ్చే ఎన్నికల నాటికి తనకు టిక్కెట్ దొరకకపోయినా ఆశ్చర్యం లేనంతగా పరిస్థితులు మారిపోయాయి. నవ నాయకత్వం ప్రతి నియోజకవర్గంలో తయారవుతుంది. వారిని ప్రోత్సహించడానికి, వారికి సీట్లు, మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకే సైకిల్ పార్టీ సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. ఈనేపథ్యంలో అచ్చెన్నాయుడు కూడా తన వారసుడిని రంగంలోకి దించుతున్నారు. ముందుగా రాజకీయాల్లో కాకుండా పార్టీ అధినేత చంద్రబాబుకు పరిచయ కార్యక్రమంతో ఆయన తన వారసుడిని రాజకీయంగా అందలం ఎక్కించేందుకు సిద్ధపడినట్లే కనిపిస్తుంది. దీంతో అచ్చెన్నాయుడు కూడా వచ్చే ఎన్నికల నాటికి ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారన్న సిగ్నల్స్ ఒకరకంగా నియోజకవర్గ ప్రజలకు, మరొక వైపు అధినాయకత్వానికి ఇచ్చినట్లయింద.ి
కుమారుడిని రంగంలోకి...
ఇటీవల అచ్చెన్నాయుడు తన కుమారుడు కృష్ణమోహన్ ను చంద్రబాబుకు పరిచయం చేశారు. శ్రీకాకుళంజిల్లాలో రాజకీయంగా బలమైన కుటుంబం కింజారపు కుటుంబం. ఆ కటుంబం నుంచి ఇప్పటికే యువనేత రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకు రావాలన్నది చంద్రబాబు, లోకేష్ బలమైన ఆకాంక్ష. వచ్చే ఎన్నికల నాటికి రామ్మోహన్ నాయుడు తన కుటుంబం నుంచే తనకు పార్టీలో ప్రత్యర్థి అయ్యే అవకాశాలున్నాయి. తనను పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది అచ్చెన్న అభిప్రాయం. అందుకే ఆయన తాను తప్పుకుని తన కుమారుడు ఎంపీ టిక్కెట్ అయినా పరవాలేదు.. ఏదో ఒక రాజకీయ పదవి ఉంటే చాలునన్న ఉద్దేశ్యంతో కుమారుడు కృష్ణమోహన్ ను రాజకీయ అరంగేట్రం చేయించే పనిలో ఉన్నారు. ఇప్పటికే టెక్కలి బాధ్యతలను చూస్తున్న కృష్ణమోహన్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఆదేశిస్తే టెక్కలి నుంచి అసెంబ్లీకి, లేదంటే శ్రీకాకుళం ఎంపీ పదవికి పోటీ చేసే వీలుంది.
Next Story