Fri Dec 20 2024 16:51:03 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ వార్తల్లో నిమ్మగడ్డ ప్రసాద్.. ఈసారి ఏమైందంటే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. జగన్ కంపెనీల్లో రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. సీబీఐ తనపై మోపిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ సోమవారం కోర్టు నిర్ణయాన్ని ప్రకటించారు.
జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు క్విడ్ ప్రొ కోలో భాగమా? కాదా? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. దురుద్దేశంతోనే క్రిమినల్ కేసు పెట్టారన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. కేసు పెట్టడానికి తగిన ఆధారాలు, కారణాలు లేవన్న పిటిషనర్ వాదనను కూడా తిరస్కరిస్తున్నట్టు తెలిపింది. సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్ కపాడియా వాదనలు వినిపిస్తూ ప్రసాద్‌పై కేసును దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా విచారించిందని, వాన్‌పిక్ (వోడరేవు, నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్) ప్రాజెక్టును అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రసాద్‌కు కేటాయించిందని ఆధారాలు సేకరించారు. ప్రసాద్ ప్రమోట్ చేసిన కంపెనీలకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎకరాల భూమిని అన్ని చట్టాలు, నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి అనేక రాయితీలు మంజూరు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
Next Story