Sun Mar 16 2025 23:37:36 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ప్రధాన మైన పోస్టుల దక్కాలంటే పది సూత్రాలు .. ఇవేనట
తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టు భర్తీ విషయంలో కసరత్తు ప్రారంభించింది

తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టు భర్తీ విషయంలో కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తుండటంతో దిగువ స్థాయి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాము పడిన కష్టానికి ఈసారైనా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఇటు కూటమిలోని అన్ని పార్టీలూ నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తల పేర్లను పంపాలని చంద్రబాబు నాయుడు సూచించడంతో వారు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి పేర్లు అయితే వచ్చాయి. పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది.
ముఖ్యమైన నేతలకు...
నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో చంద్రబాబు అనేక సూత్రాలను పాటిస్తున్నారు. ప్రాంతాలు, కులాలు, పార్టీల వారీగా పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమైన, ప్రాధాన్యత కలిగిన పోస్టులకు గత ఎన్నికల్లో సీట్లు దక్కని వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. వారిని కొంత కాలం నామినేటెడ్ పదవుల్లో ఉంచితే కొంతలో కొంత ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ తగ్గుతుందని భావిస్తున్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యేలను, గత ఎన్నికల్లో టిక్కెట్ రాని వారికి ముఖ్యమైన పోస్టుల్లో నియమించాలన్న ప్రతిపాదన ఒకటి ఆయన సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన నేతలకు ఇప్పటికే ఫోన్లు చేసి సమాచారం అందించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రధాన దేవాలయాల్లో...
ముఖ్యంగా ప్రధాన దేవాలయాల్లో బాగా కష్టపడి పనిచేసిన నేతలకు, కార్యకర్తలకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పాలకమండలిని భర్తీ చేసే ఉద్దేశ్యంతో ఉన్న ఆయన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ముఖ్యమైన నేతలకు ఇవ్వాలని భావిస్తున్నారు. పోస్టులు తక్కువ, పేర్లు ఎక్కువగా ఉండటంతో మొదటి రెండు జాబితాల్లో రాని వారికి మలి జాబితాలో చోటు కల్పించాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో పాటు తాను సొంతంగా నియోజకవర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆయన పేర్లను ఖరారు చేస్తుండటంతో పాటు లోకేశ్ సూచించిన వారికి కూడా కొంత ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. దీంతో తమ్ముళ్లలో టెన్షన్ నెలకొంది. తమకు ఈసారైనా పదవులు వస్తాయా? రావా? అన్న దానిపై ఆందోళనలో ఉన్నారు.
Next Story