Fri Nov 22 2024 21:35:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నలభై నిమిషాల భేటీలో ఏం జరిగిందంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాతో నిన్న రాత్రి భేటీ అయ్యారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షాతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. నలభై నిమిషాలు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాత్రి 11.25 గంటలకు చంద్రబాబు అమిత్ షా నివాసానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు ఆయనతో రాజకీయ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల పైన కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
రాజ్యసభ ఎన్నికల్లో...
రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలసి పోటీ చేయాలని చంద్రబాబు అమిత్ షాను కోరినట్లు తెలిసింది. 2014 కాంబినేషన్ మళ్లీ 2024 లోనూ ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారన్న చంద్రబాబు జగన్ వల్ల రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందీ వివరించినట్లు సమాచారం. ఎన్డీఏ భాగస్వామిగా కూడా చేరడానికి తనకు అభ్యంతరం లేదని, అలాగే ఏపీలో అధికారంలోకి వస్తే ప్రభుత్వంలోనూ బీజేపీ చేరితే బాగుంటుందని అన్నట్లు తెలిసింది.
తప్పుడు కేసులు...
ఇద్దరి మధ్య స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో తనను ఎలా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసిన విషయాన్ని కూడా చంద్రబాబు అమిత్ షాకు వివరించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, అన్ని పార్టీల నేతలకు ఇది అనుభవమేనని ఆయన చెప్పారని సమాచారం. అయితే చంద్రబాబుతో మాట్లాడే సమయంలో అక్కడే ఉన్న జేపీ నడ్డా ఆయన కంటే పది నిమిషాలు ముందుగా వెళ్లిపోయారు. ఈరోజు కూడా మరోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
Next Story