Mon Dec 23 2024 03:03:50 GMT+0000 (Coordinated Universal Time)
Chandrdababu : చంద్రబాబు పాలనతో పాటు ఆ పనిని కూడా మొదలుపెడతారట.. నేటి నుంచే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు
నిన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. నేటి నుంచి ఆయన పాలనను ప్రారంభించబోతున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన చంద్రబాబు కీలక శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమవుతారని తెలిసింది. ఈరోజు నిర్ణయించిన ముహూర్తం మేరకు సాయంత్రం 4.41 గంటలకు ఆయన బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందని తెలిసింది. అయితే ఆయన కీలకమైన విషయాల్లో అధికారుల నుంచి వివరాలను తెలుసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
లిక్కర్ సేల్స్ విషయంలో....
సమయం ఉంటే ఈరోజు లేకుంటే రేపటి నుంచి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ఐదేళ్లలో అనేక శాఖల్లో అవినీతి జరిగిందని చంద్రబాబు పదే పదే ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ప్రధానంగా ఎక్సైజ్ శాఖ ఇందులో ముందుంది. కేవలం నగదును మాత్రమే తీసుకుంటూ డిజిటల్ పేమెంట్ లేకుండా వసూలు చేసిన మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిందని కూడా ఆయన విమర్శలు చేశారు. అయితే దీనిపై పూర్తి స్థాయి వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గత పాలనలో జరిగిన విషయాలను తెలుసుకునేందుకు తొలుత ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని తెలిసింది. డిస్టిలరీల అనుమతిని కూడా రద్దు చేయడం, కొత్త వాటికి ఓకే చెప్పడంపైన కూడా ఆయన అధికారులతో చర్చించనున్నారు. ఖచ్చితంగా సమాచారం ఉంటే విచారణకు కూడా ఆదేశించే అవకాశాలున్నాయంటున్నారు.
గనుల శాఖలో...
దీంతో పాటు ఇసుక పంపిణీ విధానంపై కూడా చంద్రబాబు సమీక్షించనున్నారు. ఆయన ఇసుకతో పాటు గనులను కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఎన్నికల ప్రచారంలో పదే పదే ఆరోపించారు. గనుల శాఖ ఉన్నతాధికారులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమై గత ఐదేళ్లలో జరిగిన వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని వెంటనే మార్చేందుకు చంద్రబాబు ఒక పక్క సిద్ధమవుతూ మరొక వైపు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కూడా విచారణకు ఆదేశించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు బాధ్యులైన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా అవసరమైతే కేసులు నమోదు చేయాలని ఆదేశించే ఛాన్స్ ఉంది. అందుకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేందుకు చంద్రబాబు తొలి ప్రయత్నం మొదలుపెడతారంటున్నారు.
రెవెన్యూ శాఖలో...
ఇక మరో కీలకమైన శాఖ రెవెన్యూ. రెవెన్యూ శాఖలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. అంతేకాదు సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు వేయడంతో పాటు అనేక చోట్ల ప్రభుత్వ, దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపణలు వస్తుండటంతో రెవెన్యూ శాఖ నుంచి పూర్తి సమాచారం తెలుసుకోనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఈరోజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత విశాఖతో పాటు ముఖ్యమైన నగరాలు, జిల్లా కేంద్రాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి భూములు ఎవరి నుంచి కొనుగోలు చేశారన్నది దానిపై కూడా పూర్తి స్థాయి విచారణకు చంద్రబాబు సిద్ధమయ్యారట. ఎక్కువ మంది వైసీపీ నేతలకు చెందిన భూములను కొనుగోలు చేశారని అప్పట్లో ఆయన ఆరోపించిన నేపథ్యంలో ఈ శాఖపై సమీక్ష అనంతరం చర్యలకు దిగే అవకాశముందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. తప్పు చేసిన వారిని తమ ప్రభుత్వం క్షమించబోదన్న సంకేతాలను బలంగా పంపించడంతో పాటు సరిహద్దురాళ్లపై ఉన్న జగన్ ఫొటోలను తొలగించాలన్న ఆదేశాలను కూడా జారీ చేయనున్నారట. మొత్తం మీద మొదటి రోజు నుంచే చంద్రబాబు పని మొదలుపెట్టే అవకాశముంది.
Next Story