Mon Nov 18 2024 04:34:23 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రెండు రోజులు ముందుగానే.. జగన్ కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగోసారి ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే ఇందుకు రెండు రోజులు ముందుగానే యాక్టివ్ అవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశారు. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. సంక్షేమ పథకాలు విరివిగా అమలు చేసినా కూటమి ముందు జగన్ నిలబడలేకపోయారు. అదే సమయంలో పడిపోయిన పార్టీకి తిరిగి పునరుజ్జీవం తేవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ఐదేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
కుంగిపోకుండా...
ఓడిపోయామని కుంగిపోకుండా కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించాలని నిశ్చయించారు. అంటే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడానికి రెండు రోజులు ముందు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని నేతలకు ఆదేశాలు జారీచేశారు. అవసరమైతే జగన్ కూడా కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. తాను నివాసం ఉంటున్న తాడేపల్లి లోనే పార్టీ కేంద్ర కార్యాలయం పని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. అందుకు ప్రత్యేకంగా సిబ్బందితో పాటు నేతలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. కార్యకర్తలు భయపడకుండా వారిలో భరోసా నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
లీగల్ టీం...
మొన్నటి వరకూ తాడేపల్లిలోని తన నివాసం సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంది. అయితే దానిని పార్టీ కేంద్ర కార్యాలయంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయంలో న్యాయసలహాలు, సహకారం అందించేందుకు లీగల్ టీం కూడా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఏపీలో ఫలితాల అనంతరం జరుగుతున్న ఘర్షణలతో పాటు నమోదవుతున్న కేసుల విషయంలో కూడా వారికి ఉచితంగా న్యాయసాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి నుంచి ఓటమికి గల కారణాలను కూడా ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తారంటున్నారు. ఓటమికి తాము చేసిన తప్పొప్పులను కూడా ఆయన సమీక్షించుకోనున్నారని తెలిసింది. మొత్తం మీద ఐదో తేదీ ఫలితాలు వస్తే పదోతేదీన తిరిగి జగన్ యాక్టివ్ అవుతుండటం వైసీపీ వర్గాల్లో కొంత జోష్ నింపుతుంది.
Next Story