Thu Jan 16 2025 07:43:12 GMT+0000 (Coordinated Universal Time)
అభ్యర్థుల కోసం బాబు వేట... అందుకేనట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాల్సి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికలకు మూడేళ్లు సమయం ఉన్నా ఆయనకు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో అభ్యర్థుల కొరత ఉండదు. కానీ పార్లమెంటు నియోజకవర్గాలకు వచ్చేసరికి చంద్రబాబు తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఏ పార్లమెంటు నియోజకవర్గం చూసినా సరైన నేత ఆయనకు కన్పించడం లేదు.
మూడు చోట్ల మాత్రమే....
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు మాత్రమే గెలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అనేక మంది పార్టీని వీడిపోగా, మరికొందరు ఇన్ యాక్టివ్ గా ఉన్నారు. కేవలం నాలుగైదు నియోజకవర్గాలకు తప్పించి టీడీపీకి ఎంపీ అభ్యర్థుల కొరత స్పష్టంగా కన్పిస్తుంది.
కొందరు ఇన్ యాక్టివ్ గా...
విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు పెద్దగా యాక్టివ్ గా లేరు. విశాఖలో శ్రీ భరత్ కొంత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనకాపల్లికి అభ్యర్థి ఎవరన్నది స్పష్టత లేదు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఏలూరులో మాగంటి బాబు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నర్సాపురంలో శివ ఇన్ యాక్టివ్ గా ఉన్నారు. మచిలీపట్నంలో మాత్రం కొనకళ్ల నారాయణ కొంత యాక్టివ్ గానే కనపడుతున్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి మాల్యాద్రి సయితం పార్టీకి దూరంగానే ఉన్నారు.
పార్టీలు మారి.....
ఒంగోలు ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్ రావులు వైసీపీలో చేరిపోయారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్, రాజంపేట అభ్యర్థి సత్యప్రభ మరణించారు. తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనంతపురం, హిందూపురం ఎంపీ అభ్యర్థులు జేసీ పవన్, నిమ్మల కిష్టప్పలు యాక్టివ్ గానే ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కొంత యాక్టివ్ గానే ఉన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా గౌరు వెంకటరెడ్డిని నియమించారు. ఆయన కూడా యాక్టివ్ గా లేరు. మొత్తం మీద చంద్రబాబుకు 23 నియోజకవర్గాల్లో దాదాపు పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉంది. మరి దీనిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో అన్నది చూడాల్సి ఉంది.
Next Story