Thu Jan 09 2025 03:15:39 GMT+0000 (Coordinated Universal Time)
TDP : లోకేష్ అసలు నిజం చెప్పేశారా? ఇకవారికి భవిష్యత్ లో పదవులు ఉండవా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీనియర్ నేతలకు క్లారిటీ ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీనియర్ నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఎవరూ రెండుసార్లు ఒకే పదవిలో ఉండటానికి వీలు లేదని చెప్పారు. వరసగా రెండుసార్లు పదవిలో ఉంటే అంతకంటే ఉన్నత పదవికైనా వెళ్లాలి.. లేదంటే పూర్తిగా ఒక విడత విరామాన్ని ప్రకటించాలని ఆయన చేసిన ప్రకటన సీనియర్లను ఉద్దేశించి చేసినట్లుగానే కనపడుతుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు పార్టీకి ఇబ్బందిగా మారారు. నియోజకవర్గాలను వారు వదలరు. అలాగే గెలిచిన తర్వాత మంత్రి పదవుల కోసమో.. మరో ముఖ్యమైన పదవుల కోసమో పట్టుబట్టడం మామూలయి పోయింది. అయితే ఈసారి కొంత చంద్రబాబు యువకులకు కేబినెట్ లో అవకాశం కల్పించారు.
సీనియర్లు కొంత అలక వహించి...
అందుకే కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తమకు పదవులు దక్కలేదన్న ఆక్రోశంతో ఉన్నారు. యనమల రామకృష్ణుడు వంటి నేతలయితే ఒకడుగు ముందుకేసి పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తూర్పు గోదావరి, నెల్లూరు, రాయలసీమ లోని అనేక జిల్లాల్లో సీనియర్ నేతలు టీడీపీలోనే ఎక్కువగా ఉన్నారు. నెల్లూరు జిల్లాను తీసుకుంటే టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రిపదవి దక్కేది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు, చిత్తూరు జిల్లాలో గతంలో బొజ్జల, గాలి ముద్దు కృష్ణమ నాయుడు లాంటి వారికి మంత్రి పదవులు దక్కేవి.ఈ ఇద్దరు దివంగతులు కావడం వల్లనే కొత్త వారికి అవకాశం లభిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు వంటి వారికి మాత్రమే పదవులు లభించేవి.
సంప్రదాయాన్ని మార్చివేసి...
కానీ ఈసారి సంప్రదాయాన్ని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. అచ్చెన్నాయుడుకు మాత్రం పదవి ఇచ్చారు. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతలున్నప్పటికీ కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. గెలిచిన తర్వాత మంత్రి పదవులకు కూడా దక్కలేదు. మొన్నటి కేబినెట్ లోనే లోకేష్ చెప్పిన ఈ విధానాన్ని దాదాపు అమలు చేయడంతో సీనియర్ నేతలకు ఎవరికీ పదవులు దక్కలేదు. గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావు వంటి నేతలను కూడా పక్కన పెట్టారు.దీంతో లోకేష్ జామానా మొదలయిందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారన్న ప్రచారం ఆ పార్టీలో కిందిస్థాయి నుంచి బాగా బలపడింది.
లోకేష్ ఇచ్చిన క్లారిటీతో...
తాజాగా లోకేష్ ఇచ్చిన క్లారిటీతో ఒకవ్యక్తికి రెండుసార్లు మాత్రమే పదవి వస్తుందని చెప్పడంతో ఒకింతగా ఆశావహులు పార్టీ బలోపేతం కోసం పనిచేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా యువత ముందుకు రావాలనే ఈ రకమైన కామెంట్స్ ను లోకేష్ చేసినట్లు కనపడుతుంది. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి వంటి నియోజకవర్గాలలో ఆయనను తప్పించి మరొకరికి టిక్కెట్ లభించే ఛాన్స్ లేదని భావించి పార్టీ కార్యకర్తగానే తాము ఎల్లకాలం పనిచేయాలన్న ధోరణిలో ఉన్న వారికి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త ఆశలను చిగురింప చేశాయనే చెప్పాలి. యువతను ఆకట్టుకునేందుకు, పార్టీలో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు లోకేష్ వ్యాఖ్యలు మరింతగా ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
Next Story