Sun Dec 22 2024 19:04:32 GMT+0000 (Coordinated Universal Time)
Union Cabinet : మోదీ కేబినెట్ లో మనోళ్లు వీళ్లే...ఈ నలుగురి పేర్లు కన్ఫర్మ్ అట.. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి
కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరనుంది
కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరనుంది. అయితే కీలక శాఖల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఏదో ఒక పదవి ఉంటేచాలునన్న ఉద్దేశ్యంలో ఆయన ఉన్నారు. ఎన్డీఏలో అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతుంది. అందులో రెండు కేబినెట్ ర్యాంక్ పదవులతో పాటు మరో రెండు సహాయ మంత్రి పదవులు లభిస్తాయని చెబుతున్నారు. ఈ పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్లు కూడా వార్తలు అందుతున్నాయి.
సీనియారిటీ, సిన్సియారిటీని....
సామాజికవర్గాలు, సీనియారిటీ, సిన్సియారిటీని చూసి చంద్రబాబు ఈ దఫా కేంద్ర మంత్రివర్గంలో వారికే అవకాశం కల్పించనున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పేరు బలంగా వినపడుతుంది. పెమ్మసాని అమెరికాలో వ్యాపార వేత్త కావడంతో ఆయన అయితే ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి తీసుకు వస్తారన్న ఉద్దేశ్యంతో పెమ్మసారి చంద్రశేఖర్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. పెమ్మసానికి మాత్రం కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన వల్ల రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చే అవకాశముందని భావించడంతో పాటు గుంటూరు జిల్లా నుంచి గెలవడం అదనపు బలంగా ఆయనకు మారింది.
నమ్మకమైన కుటుంబం...
ిఇక సిన్సియారిటీ, సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్రకు చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు దాదాపుగా ఖరారయింది. ఆయన దివంగత ఎర్రన్నాయుడు కుమారుడిగా 2014, 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ఆ కుటుంబం ఉండటంతో పాటు ఉత్తరాంధ్రలో పార్టీకి వెన్నుదన్నుగా దశాబ్దాలుగా నిలుస్తుంది. రామ్మోహన్ నాయుడు మంచి వక్త కూడా కావడంతో పాటు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది. గత పదేళ్లుగా ఢిల్లీలో ఉంటూ పార్టీ వ్యవహారాలు చక్క బెడుతూ కష్టకాలంలో నిలిచినందుకు చంద్రబాబు ఆ కుటుంబానికి గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఒక్క రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఆ కుటుంబం నుంచి అసెంబ్లీలో గెలిచిన మిగిలిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా పరవాలేదన్న వాస్తవం కూడా ఉంది. ఆ కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
వీరి పేర్లు కూడా...
ఇక నెల్లూరు జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ చేయడానికి కారణమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. వేమిరెడ్డి పార్టీలో చేరిన తర్వాతనే నెల్లూరు జిల్లాలో అన్ని రకాలుగా పార్టీకి మంచి హైప్ వచ్చిందని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకోసమే వేమిరెడ్డికి కూడా పక్కగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆయన నెల్లూరు జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అదనపు బలంగా మారనున్నాయి. మరోవైపు రాయలసీమలో అనంతపురం నుంచి గెలిచిన అంబికా లక్ష్మీనారాయణ పేరును కేంద్ర మంత్రి పదవికి పరిశీలనలో ఉంది. లక్ష్మీనారాయణ వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన పేరును కూడా బాగా పరిశీలిస్తున్నారు. ఇక కర్నూలు నుంచి గెలిచిన బస్తిపాటి నాగరాజు పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద నలుగురు పేర్లు బాగా ఢిల్లీలో నలుగుతున్నాయి. మరి చివరకు ఎవరికి చంద్రబాబు ఓకే చెబుతారన్నది చూడాల్సి ఉంది. అయితే మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్ పేరు డిప్యూటీ స్పీకర్ పేరు వినపడుతుంది.
Next Story