Sun Dec 22 2024 12:35:51 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే వాహనంపై వెళ్లినందుకు.. తెలుగు జర్నలిస్టుపై అభ్యంతకర వ్యాఖ్యలు
సంక్రాంతి సందర్భంగా రిపోర్టింగ్ చేయడానికి వెళ్లిన ఒక మహిళా జర్నలిస్ట్ వైసీపీ నేత బైక్పై కూర్చుని వెళ్లడంపై
సంక్రాంతి సందర్భంగా రిపోర్టింగ్ చేయడానికి వెళ్లిన ఒక మహిళా జర్నలిస్ట్ వైసీపీ నేత బైక్పై కూర్చుని వెళ్లడంపై మరో పార్టీ మద్దతుదారులు ఆన్లైన్లో దూషణలకు దిగారు. ఆమె సోషల్ మీడియా వేదికగా లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొంది. టీవీ9 రిపోర్టర్ అయిన ముప్పై ఐదేళ్ల హసీనా షేక్ జనవరి 13, శనివారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సంక్రాంతి వేడుకలను కవర్ చేశారు. ఆమె వైఎస్సార్సీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెనుక కూర్చొని, బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో హసీనా షేక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, లోహిత్తో సహా చాలా మంది టీడీపీ సభ్యులు ట్విట్టర్లోకి వెళ్లి హసీనాపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. జనవరి 14, ఆదివారం నాడు ప్రసారమైన TV9 తెలుగులో సంక్రాంతి కోడిపందాల పోటీల గురించిన వార్తలను కవర్ చేశారు హసీనా. సెమీ స్క్రిప్ట్ షో కోసం సాంప్రదాయ దుస్తులలో కొడాలి నాని కనిపించారు. ఆ సమయంలో హసీనా కొడాలి నానిని ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ వరకు అనుసరించాల్సి వచ్చింది, ఆ సమయంలో ఆమె నాని నడుపుతున్న బైక్ వెనుక కూర్చోవాల్సి వచ్చింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థలో పని చేస్తున్న జర్నలిస్టు ఇలా వెళ్లడం కరెక్ట్ కాదంటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బూతులు కూడా తిట్టారు. ఈ విషయంపై హసీనా మాట్లాడుతూ.. 2005 నుండి TV9తో కలిసి పని చేస్తున్నాను. టీడీపీకి సరైన కవరేజీని అందించడం లేదని ఆ పార్టీ మద్దతుదారులలో ఓ రకమైన భావన ఉంది, దాని కారణంగా వారు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. టీడీపీ నాయకుల అధికారిక హ్యాండిల్స్ కూడా అలాంటి ట్వీట్లతో వీడియోను మళ్లీ పోస్ట్ చేశారని హసీనా వాపోయారు. మా ఛానెల్ కవరేజ్ పక్షపాతంగా ఉందని వారు భావిస్తే, వారు దానిని మేనేజ్మెంట్తో మాట్లాడుకోవచ్చు.. నేను స్త్రీని అనే వాస్తవాన్ని కూడా పరిగణించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నో అంశాలపై కూడా నివేదికలు అందించానని.. కేదార్నాథ్ వరదలు, ఉక్రెయిన్ యుద్ధం వంటి చాలా సమస్యలపై కూడా నివేదించాను. ఇప్పటి వరకూ నా కవరేజీలో ఏ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వలేదని హసీనా తెలిపారు. తన మీద చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్కు, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తానని హసీనా తెలిపారు.
Next Story