Thu Nov 14 2024 16:34:51 GMT+0000 (Coordinated Universal Time)
హనుమ విహారి వివాదంపై చంద్రబాబు సంచలన ట్వీట్
ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఏపీ పాలిటిక్స్లో
ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఏపీ పాలిటిక్స్లో దుమారం రేపింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘వైఎస్సార్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు. హనుమవిహారి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్. అతను ఆంధ్రప్రదేశ్ తరపున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేశారు. హనుమ మీరు దృఢంగా ఉండండి. ఆట పట్ల మీ చిత్తశుద్ధి, నిబద్ధత వెలకట్టలేనిది. ఇలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవు. మేము మీకు అండగా ఉంటాము.. మీకు న్యాయం జరిగేలా చూస్తాము.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తీరు తనను ఎంతో వేధనకు గురి చేసిందని, తన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపించాడు. ఇకపై ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడే ప్రసక్తే లేదని తెలిపాడు. జట్టులో 17వ సభ్యుడి పైన అరవడం కారణమే కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసిందని తెలిపాడు. జట్టులో 17వ సభ్యుడు ఓ రాజకీయ నాయకుడు కుమారుడని చెప్పాడు. హనుమ విహారి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. ఆంధ్రా క్రికెట్ సంఘం ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తుందని.. సీనియారిటీ ఆధారంగా ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం గానీ, లేకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వడం గానీ జరగదని వివరణ ఇచ్చింది. బెంగాల్ తో రంజీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడిని హనుమ విహారి అందరి ముందు వ్యక్తిగతంగా దూషించాడన్న విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపింది. జాతీయ బాధ్యతల నేపథ్యంలో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేనంటూ విహారి తెలుపడంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్ ను నియమించాం. సీనియర్ బ్యాట్స్ మన్ రికీ భుయ్ ని కొత్త కెప్టెన్ గా నియమిస్తున్నట్టు అప్పట్లో సెలెక్షన్ కమిటీ తెలిపింది. ఈ నిర్ణయం పట్ల హనుమ విహారి కూడా హర్షం వ్యక్తం చేశాడని తెలిపింది.
Next Story