Sun Dec 22 2024 23:45:48 GMT+0000 (Coordinated Universal Time)
12 గంటల్లో వాయుగుండం.. 48 గంటల్లో అతిభారీ వర్షాలు
భారీవర్షాల నేపథ్యంలో వరదలు వచ్చే అవకాశం ఉండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని..
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 12 గంటల్లో ఇది మరింత తీవ్రమై.. వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దాని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు..విశాఖ నగరంలో, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
భారీవర్షాల నేపథ్యంలో వరదలు వచ్చే అవకాశం ఉండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. రానున్న మూడురోజుల వరకూ ఏపీపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. గరిష్ఠంగా సుమారు 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం.. అంతకన్నా ఎక్కువే నమోదు కావొచ్చని తెలిపింది. తెలంగాణకు మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నేడు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Next Story