Fri Apr 04 2025 06:14:17 GMT+0000 (Coordinated Universal Time)
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 3 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగాఉన్నాయి. ఎమర్జెన్సీ..

గత 5-6 రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. భద్రాచలం వల్ల నదినీటిమట్టం 50.50 అడుగులు దాటగా.. రెండో ప్రమాదహెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరికి వరద పోటెత్తడంతో అధికారులు గురువారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నదినీటిమట్టం 12.7 అడుగుల వద్ద ఉండగా.. డెల్టా పంటకాలువలకు 4 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 11.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేస్తుంది.
అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 3 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగాఉన్నాయి. ఎమర్జెన్సీ హెల్ప్ కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 1800 425 0101 నంబర్లను 24 గంటలు అందుబాటులో ఉంచారు. తెలంగాణకు మరో 48 గంటలు అతిభారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉండటంతో.. గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
నేడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నంద్యాల, కర్నూల్, అనంతపురం జిల్లాల్లోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీవర్షం కురవవచ్చని తెలిపింది. మరో ఐదు రోజుల వరకూ కోస్తాంధ్రకు భారీవర్షసూచన లేదని తెలిపింది.
Next Story