Mon Dec 23 2024 04:21:12 GMT+0000 (Coordinated Universal Time)
ప్రతి విద్యార్థికీ డిగ్రీ పట్టా అందించడమే లక్ష్యం : సీఎం జగన్
జగనన్న ఆణిముత్యాలు పేరుతో.. జూన్ 12 నుండి వారంరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సత్కారాలు నిర్వహించారు. పదవ తరగతిలో..
ప్రతి విద్యార్థికీ డిగ్రీ పట్టా అందించడమే లక్ష్యంగా.. విద్యార్థుల కోసం విద్యాదీవెన, వసతిదీవెన పదకాలు తీసుకొచ్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయవాడలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ ను సత్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై రేపటి ప్రపంచానికి ఫలాలను అందించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు.. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రతి విద్యార్థికి ట్యాబులు అందజేస్తున్నామని తెలిపారు. ప్రతీ విద్యార్థికీ డిగ్రీ పట్టా అందించడమే లక్ష్యంగా.. విద్యా దీవెన, విద్యా వసతి పదకాల కింద ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో సీటు సంపాదించి.. చదువుకునే విద్యార్థుల ఫీజులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని, జగనన్న సర్కార్ విద్యార్థులకు అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.
జగనన్న ఆణిముత్యాలు పేరుతో.. జూన్ 12 నుండి వారంరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సత్కారాలు నిర్వహించారు. పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు లక్ష, ద్వితీయ ర్యాంకర్ కు రూ.75 వేలు, తృతీయ ర్యాంకర్ కు రూ.50 వేలు ప్రోత్సాహకాలను అందించారు. మొత్తం 42 మంది టెన్త్ విద్యార్థులు ఈ సత్కారాలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో ప్రథమ టాపర్ కు రూ.50వేలు, సెకండ్ టాపర్ కు రూ.30 వేలు, మూడో టాపర్ కు రూ.15 వేలు ఇవ్వనున్నారు. వీటికి 609 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అలాగే నియోజకవర్గస్థాయిలో నగదు పురస్కారాలకు 681 మంది ఎంపికవ్వగా.. ప్రథమ పురస్కారం 15వేలు, ద్వితీయ పురస్కారం రూ.10వేలు, తృతీయ పురస్కారం 5 వేలు అందజేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రథమ-3వేలు, ద్వితీయ-2 వేలు, తృతీయ-వెయ్యి రూపాయల పురస్కారాలను 20,299 మంది విద్యార్థులకు అందించనున్నారు.
అలాగే ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో గ్రూపుల వారీగా 26 మంది టాపర్లు ఎంపికయ్యారు. నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు. 26 మంది టాపర్లకు రూ.1లక్ష నగదు పురస్కారం ఇస్తారు. అలాగే జిల్లాస్థాయిలో గ్రూపులవారీగా 391 మంది టాపర్లకు రూ.50 వేల చొప్పున, నియోజకవర్గ స్థాయిలో 662 మంది టాపర్లకు రూ.15 వేల చొప్పున నగదు పురస్కారాలు అందజేయనున్నారు.
Next Story