ఢిల్లీకి చేరిన ఏపీ నకిలీ ఓట్ల పంచాయతీ
తెలంగాణలో కంటే ఏపీలో రాజకీయాలు ఎప్పుడు చూసినా వాడివేడిగానే ఉంటాయి. ప్రతి రోజు విమర్శలు, ఘర్షణలు, ఒకరిపై ఒకరు నిందలు..
తెలంగాణలో కంటే ఏపీలో రాజకీయాలు ఎప్పుడు చూసినా వాడివేడిగానే ఉంటాయి. ప్రతి రోజు విమర్శలు, ఘర్షణలు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఇలా ఒకటేమిటి రకరకాల రాజకీయాలు ఏపీలోనే ఉంటాయి. ముఖ్యంగా అటు అధికా పార్టీ అయిన వైసీపీ, ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే ఒకరిపై ఒకరు నిప్పులు చిమ్ముకునేలా ఉంటాయి. ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకేముందు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇలా 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు.. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూనే ఉంటారు నేతలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు దాటి ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఢిల్లీకి చేరడం ఏంటని అనుకుంటున్నారా..? అదే ఓట్ల తొలగింపు. ఈ ఓట్ల తొలగింపు రాజకీయం తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లిందంటే ఏ స్థాయిలో చిచ్చుపుట్టిందో ఇట్టే అర్థమవుతోంది.
ఇలా నకిలీ ఓటర్ ఐడీ కార్డులపై వైసీపీ, టీడీపీ నేతలు చేస్తోన్న యుద్ధం హస్తినకు చేరి మరింత చిచ్చు ముదురుతోంది. ఎవరికి వారు పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకేముంది ఈ నకిలీ ఓట్ల పంచాయితీపై ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఎన్నికల కమిషన్‌దేనని రెండు పార్టీల నేతలూ స్పష్టం చేస్తున్నారు.
అయితే ఏపీలో ఓట్ల అక్రమాలు జరిగాయంటూ సైకిల్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ వెళ్లిన ఆయన సీఈసీతో గంటపాటు భేటీ అయ్యారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఫిర్యాదు చేశారు. సీఈసీతో సమావేశం తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ఢిల్లీకి వచ్చానంటూ, ఆధారాలతో సహా కంప్లాయింట్ చేశానంటూ చెప్పారు. ఎన్నికలు జరిగేలోగా అధికారులు ఏపీకి వచ్చి ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు.
ఇక ఫిర్యాదు చేయడం టీడీపీ వంతు అయిపోతే మరో వైపు టీడీపీ హయాంలోనే ఏపీలో ఓట్లలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు సైతం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు సీఈసీతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని ఈపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆధార్‌తో ఓటర్ కార్డును అనుసంధానించడం ద్వారా బోగస్ ఓట్లను తొలగించవచ్చని సీఈసీకి సలహా కూడా ఇచ్చామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మరి ఢిల్లీకి చేరిన నకిలీ ఓట్ల పంచాయితీ ఎన్నికల కమిషన్ ఏ మేరకు చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. అయితే ఎప్పుడు రాష్ట్రంలోనే చిచ్చురేపే రాజకీయాలు.. ఇప్పుడు ఢిల్లీకి చేరడంపై రాజకీయాలు మరింత భగ్గుమనేలా ఉన్నాయి.