Thu Nov 07 2024 12:53:59 GMT+0000 (Coordinated Universal Time)
ముంబయ నటి వేధింపుల కేసుల్లో పీకల్లోతు కష్టాల్లో పీఎస్ఆర్.. కాపాడటం కష్టమేనా?
ముంబయి నటి కేసులో అనేక మంది ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు మరి కొందరిపై కేసుల నమోదవుతాయి
ముంబయి నటి అరెస్ట్ కేసులో అనేక మంది ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు రాజకీయనేతలపై కూడా కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముంబయి నటిపై అక్రమ కేసులతో పాటు వేధింపులకు పాల్పడటంతో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై వేటు పడింది. అయితే విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ ఇంటలిజెన్స్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఇందులో పీకల్లోతులో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అధికారులను అమరావతిని వదిలి పెట్టి వెళ్లవద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సీఐడీ జరిపిన లోతు విచారణలో నాటి ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ సలహాదారు పాత్ర కూడా ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు తగిన ఆధారాలను సేకరించే పనిలో సీఐడీ టీం ఉన్నట్లు తెలిసింది.
అంతా నా ఇష్టం...
ముంబయి నటి వేధింపుల కేసులో నాడు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన ఆదేశాల కారణంగానే కింది స్థాయి అధికారులు ఈ వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. సీతారామాంజనేయులు ముంబయి నటి కేసు విషయంలో పీఎస్ఆర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు. సీఎంవో అధికారుల మెప్పు పొందేందుకు, ఒక ప్రభుత్వ సలహాదారు ప్రశంసలు దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నించారని, అందులో భాగంగా ఆ కేసులో ఆధారాలను తొలగించినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. ఫోన్లను కూడా తన వద్దనే ఉంచుకున్న పీఎస్ఆర్ నిబంధనలను తుంగలో తొక్కారంటూ దర్యాప్తు అధికారులు అందచేసిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముంబయి నటి నుంచి స్వాధీనం చేసుకునే ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేముందు వాటిని ఓపెన్ చేసేందుకు పీఎస్ఆర్ ప్రయత్నించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ సాంకేతిక ఆధారాలతో నిరూపించగలిగితే పీఎస్ఆర్ కు కేవలం ఉద్యోగ పరంగా మాత్రమే కాకుండా, చట్టపరంగా అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
సీఎంవో కార్యాలయంపై...
ఇక నాటి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందులో భాగస్వామిగా మారినట్లు దర్యాప్తులో వెల్లడయింది. పీఎస్ఆర్ ఆంజనేయులును సీఎంవోకు పిలిపించి మరీ ఈ కేసును డీల్ చేయాలని, ఐపీఎస్ అధికారులకు ఆదేశాలివ్వాలని సూచించినట్లు చెబుతున్నారు. ముంబయి నటిని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయి నటిని అరెస్ట్ చేయాలంటూ సీఎంవోలో ముఖ్యమైన అధికారి కూడా స్వయంగా చెప్పినట్లు తెలిసింది. గత ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతా తానే అయి చక్రం తిప్నిన ఆ అధికారి చేసిన సిఫార్సులతోనే పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీ, పీఎస్ఆర్ ఆంజనేయులను పిలిపించుకుని మరీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అందుకే ఈ ముగ్గురు అధికారులపై వేటు పడిందంటున్నారు.
నాటి సలహాదారు ప్రమేయం...
మరోవైపు నాటి సలహాదారు ప్రమేయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది నాటి ముఖ్యమంత్రికి అత్యంత కీలకమైన విషయమని, అందుకే ఈ కేసును రహస్యంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని చెబుతున్నారు. అయితే దీనిపై తన ప్రమేయం లేదని, ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని, నాటి సలహాదారు చెబుతున్నప్పటికీ ఆయన కూడా ఈ కేసులో ఇరుక్కునే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే సాంకేతికపరమైన ఆధారాలను సేకరించిన సీఐడీ పోలీసులు మరింత పకడ్బందిగా కేసులో ముందుకు వెళితే పెద్దతలకాయలే ఇరుక్కునే అవకాశముందని చెబుతున్నారు. ఇందులో నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రమేయంపైనా దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. అతి త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని ఇప్పటికే సీఐడీ వేగంగా అడుగులు వేస్తుంది.
Next Story