Tue Apr 22 2025 02:17:37 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఇంత తక్కువగా ఉంది ఏంటి గోవిందా?
తిరుమలలో ఈరోజు భక్తులు తక్కువగానే ఉంది. గత కొద్ది రోజులుతో పోలిస్తే బుధవారం భక్తుల రద్దీ అంతగా లేదు

తిరుమలలో ఈరోజు భక్తులు తక్కువగానే ఉంది. గత కొద్ది రోజులుతో పోలిస్తే బుధవారం భక్తుల రద్దీ అంతగా లేదు. గత కొన్ని రోజులుగా వరసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. సర్వదర్శనానికి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కంపార్ట్ మెంట్లలో కూడా గంటల సేపు వేచి చూడాల్సి ఉంది. అయితే నేడు మాత్రం భక్తుల రద్దీ అంతగా లేదు. కంపార్ట్ మెంట్లలో వేచి చూడకుండానే నేరుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వీలవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
వసంతోత్సవాలు...
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండో రోజు...
రెండవరోజు ఏప్రిల్ 11వ తేదీన శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఏడు గంటలు...
ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేకదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,201 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,040 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story