Thu Apr 10 2025 01:36:12 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala Rama Krishna Reddy : సజ్జల మెడపై వేలాడుతున్న కత్తి.. ఎప్పుడైనా? ఏ క్షణమైనా?
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది

వైసీపీ అధికారంలో ఉండగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలను ఆయనే పర్యవేక్షిస్తూ ముఖ్యంగా పదేళ్ల పాటు హోం శాఖను తాను వెనకనుంచి నడిపించారని నాడు విపక్షాలు ఆరోపించాయి. ఆయనకు సకల శాఖల మంత్రిగా కూడా పేరు పెట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జల సంగతి చూస్తామని నాడు టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై పార్టీ క్యాడర్ నుంచి టీడీపీ అధినాయకత్వానికి విమర్శలు ఎదురవుతున్నాయి.
హోం శాఖను చేతులోకి తీసుకుని...
మిగిలిన నేతలందరూ ఒక ఎత్తు. సజ్జల రామకృష్ణారెడ్డి మరొక ఎత్తు. జగన్ ఆదేశాలను నేరుగా పర్యవేక్షిస్తూ వాటిని అమలు చేయడంలో సజ్జల మాత్రమే ప్రధానంగా వ్యవహరించారని టీడీపీ నేతలు గతంలో ఆరోపణలు చేశారు. మేకతోటి సుచరిత, తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో వారి మాట కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలే హోంశాఖలో చెల్లుబాటు అయ్యేవని చెబుతారు. నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబు నుంచి అనేక మంది నేతలు, కార్యకర్తలు జైలు పాలవ్వడానికి, అక్రమ కేసులు ఎదుర్కొనడానికి కారణం సజ్జల అని పసుపు పార్టీ నేతలు తడుముకోకుండా చెబుతారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారంటూ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంది.
స్క్రిప్ట్ ఆయనదే...
టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నాడు వైసీపీ నేతలు దూషించినప్పటికీ, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో మీడియా సమావేశాలు పెట్టినప్పటికీ, దానికి కారణం వారు కాదని ఆ స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డిదేనని టీడీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. స్వతహాగా జర్నలిస్ట్ కావడంతో ఎవరు ఏం మాట్లాడాలో ముందుగానే సజ్జల నిర్ణయించి స్క్రిప్ట్ తయారు చేసి పంపేవారని, దానికి అనుగుణంగా నేతలు మాట్లాడే వారని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని అలా వదిలేయడం పై టీడీపీ క్యాడర్ గుర్రమంటుంది. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా వ్యవహరిస్తూ టీడీపీ నేతలపై బురద జల్లిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
ముందస్తు బెయిల్ కోసం...
దీంతో తర్వాత లక్ష్యం సజ్జల రామకృష్ణారెడ్డి అని ఏపీలో ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. అనేక కేసుల్లో ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కొన్నింటి విషయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ తాజాగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే టీడీపీ నేతలు మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడి, తమ పార్టీ క్యాడర్ పై వేధింపులకు పాల్పడిన ఎవరినీ వదలిపెట్టబోమంటూ నేతలు చెబుతుండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి మెడపై కత్తి వేలాడుతుందనే చెప్పాలి. ఎప్పుడైనా... ఏ కేసులోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్నది టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story