Sat Dec 21 2024 11:58:20 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ బీజేపీకి ఝలక్ ఇవ్వనున్నారా? ఇండియా కూటమి వైపు చూస్తున్నారా?
వైఎస్ జగన్ ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. బీజేపీకి దూరం జరగాలని నిర్ణయించారు
వైఎస్ జగన్ ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. బీజేపీ వాడుకుని వదిలేసే రకం అన్న నిర్ణయానికి వచ్చారు. నాడు చంద్రబాబు, నేడు తాను బీజేపీ దెబ్బకు బలయిపోయానని వైఎస్ జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన స్వరం ఇటీవల కాలంలో మారుతుంది. ఆయనతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి బీజేపికి దూరమవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లే కనపడుతుంది. జగన్ మాటలను బట్టి అది సులువుగా అర్థమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు అన్యాయం చేసిందన్న ధోరణిలో జగన్ ఉన్నారు.
ప్రత్యక్ష పొత్తును...
నిజానికి జగన్ ఎప్పుడూ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. అలాగని వ్యతిరేకించలేదు. 2014లో జగన్ ను తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జగన్ ను ఆ పార్టీ నేతలు కోరారని అప్పట్లో అనేక కథనాలు కూడా వచ్చాయి. కానీ మాత్రం 2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. కాకుంటే 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పార్టీ బీజేపీ కేంద్రంలో ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపింది. ఇండియా కూటమికి దూరంగానే జగన్ నాటి నుంచి నిలిచారు. కాంగ్రెస్ తనను అక్రమ కేసులు పెట్టి జైలులో వేశారన్న ఏకైక కారణంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పైగా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కావడం, వ్యతిరేకత ప్రజల్లో ఉండటంతో దాని దరి చేరలేదు.
చాలా హోప్స్ పెట్టుకుని...
2024 ఎన్నికలలో జగన్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని గట్టిగా విశ్వసించారు. అస్సలు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని కూడా నమ్మారు. కానీ బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరింది. అయినా జగన్ ఒంటరిగానే పోటీ చేశారు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే జగన్ ఎన్నికల కౌంటింగ్ కు ముందు దేశంలోనే వైసీపీ రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పారు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్న జగన్ కు ఫలితాల తర్వాత దిమ్మతిరిగిపోయింది. తన ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థం కాలేదు. అందుకు ఈవీఎంలు కారణమని, పరోక్షంగా బీజేపీ కూడా కొంత తోడ్పడిందని జగన్ నమ్ముతున్నారు.
ఆసరా అవసరమేనా?
ఈ నేపథ్యంలోనే హస్తిన స్థాయిలో తనకు ఏదో ఒక ఆసరా అవసరమని జగన్ భావిస్తున్నట్లుంది. అందుకే ఇండియా కూటమితో చెలిమికి సిద్ధమయినట్లే కనపడుతుంది. అయితే నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోయినా మద్దతును పరోక్షంగా ఇవ్వాలని భావిస్తున్నట్లుంది. అందుకే హర్యానా ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల తీరు వల్లనే అంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు జగన్ కూడా మద్దతు తెలిపారంటున్నారు. దేశంలో మోదీ ప్రభ తగ్గి, ఇండియా కూటమి బలం పెరుగుతుండటం కూడా టోన్ ఛేంజ్ కావడానికి ఒక కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ తో నేరుగా పొత్తుకు దిగకపోయినా హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story