Fri Apr 04 2025 05:14:56 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. తిరుమలలోని మాడ వీధులు కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. తిరుమల వీధులన్నీ గోవింద నామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. తిరుమలలో వసతి గృహాలు కూడా దొరకడం దుర్లభంగా మారింది. గంటల తరబడి వసతి గృహాల కోసం వెయిట్ చేయాల్సి వస్తుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలలో భక్తుల రద్దీ...
తిరుమలలో ఈ నెలలో భక్తులు రద్దీ పెద్దగా ఉండదని అధికారులు అంచనా వేశారు. మార్చి నెల చివరి వారం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పరీక్షలు ముగియడంతో పాటు ఫలితాల కోసం ముందుగానే మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఇక సమ్మర్ హాలిడేస్ కూడా ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద, అన్నప్రసాదం కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో నేడు భక్తులు ఉన్నారు.
పదహారు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 14 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారుల తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,873 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,065 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story