Mon Dec 23 2024 02:10:09 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో బీజేపీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదా?
ఆంధప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య సఖ్యత కొరవడింది. బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకూ పాలనను నడుపుతున్న ప్రభుత్వం బీజేపీని లైట్ గా తీసుకున్నట్లే కనపడుతుంది. ఎక్కడా బీజేపీ ప్రస్తావన లేదు. అంతా టీడీపీ, జనసేన పార్టీలు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏపీ సర్కార్ ప్రచారానికి వచ్చే సరికి తమను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. విశాఖపట్నంలో ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా వెలసిన ఫ్లెక్సీలలో పురంద్రీశ్వరి ఫొటో లేకపోవడంపై కమలం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.
మూడు పార్టీలూ...
అసలు కూటమిలో బీజేపీ ఉందా? లేదా? అని వారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించారు. అయితే ఆ సమయంలో కొందరు వేసిన ఫ్లెక్సీలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. పురంద్రీశ్వరి ఫొటో లేదు. దీంతో కూటమినేతలపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ సమానమేనని, కానీ కానీ ఫ్లెక్సీ లలో యాడ్స్ లో తమ పార్టీ అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి ఫొటో లేకపోవడమేంటని నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ ఫొటో ఉంటే ఖచ్చితంగా తమ పార్టీ నేత ఫొటో ఉండాలంటూ వారు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సభ్యత్వ నమోదులో...
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పురంద్రీశ్వరి నాయకత్వంపై అధినాయకత్వం ఒకింత అసహనంగా ఉందని చెబుతున్నారు. బీజేపీ సభ్యత్వాల విషయంలో పురంద్రీశ్వరి శ్రద్ధ పెట్టలేదని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పురంద్రీశ్వరికి ఫోన్ చేసి సభ్యత్వాల నమోదుపై అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు లక్షల సభ్యత్వమే అయిందని, టీడీపీ అరవై లక్షల సభ్యత్వం చేస్తే కనీసం మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఐదు లక్షల సభ్యత్వం కూడా నమోదు చేయకపోవడాన్ని ప్రశ్నించారంటున్నారు. ఇందుకు పురంద్రీశ్వరి నాయకులతో సఖ్యత గా లేకపోవడమే కారణమి భావిస్తున్నట్లు తెలిసింది. సభ్యత్వ నమోదు పట్ల మాత్రం బీజేపీ అధినాయకత్వం ఒకింత ఆగ్రహంగానే రాష్ట్ర నాయకత్వంపై ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల గొడవ మరొకటి బయటకు వచ్చింది.
Next Story