Mon Dec 23 2024 10:35:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ నోటి నుంచి
ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి చంద్రబాబు అరెస్ట్ విషయం తొలిసారి వెల్లడయ్యే అవకాశముంది. ఇందుకు విజయనగరం వేదికగా కానుంది.
ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి చంద్రబాబు అరెస్ట్ విషయం తొలిసారి వెల్లడయ్యే అవకాశముంది. ఇందుకు విజయనగరం వేదికగా కానుంది. లండన్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన జగన్ మళ్లీ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐదు మెడికల్ కళాశాలలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విజయనగరం చేరుకోనున్న జగన్ అక్కడ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారు.
బాబు అరెస్ట్...
అనంతరం ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, నంద్యాల మెడికల్ కళాశాలలను కూడా వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత వైద్య కళాశాలల ప్రారంభోత్సవం ఉంటుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి సారి ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటుండటంతో దానిపై మాట్లాడే అవకాశముంది. ఏ పరిస్థితుల్లో అరెస్ట్ చేశామని జగన్ ప్రజలకు వివరించే ఛాన్స్ ఉంది.
పవన్ ప్రకటన...
దీంతో పాటు రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించవచ్చు. నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటనపైన కూడా జగన్ స్పందించే అవకాశాలున్నాయి. టీడీపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని అధికారికంగా చెప్పడంతో దీనిపై కూడా జగన్ మాట్లాడే అవకాశముంది. జగన్ ఈ రెండు టాపిక్ల పై ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. బహిరంగ సభ పూర్తయిన అనంతరం తాడేపల్లి బయలుదేరి వెళతారు. జగన్ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story