Thu Apr 03 2025 13:41:18 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నాలుగు ఎమ్మెల్సీ పోస్టులకు ఖరారయిన నేతలు వీరేనా?
ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీలో ఉత్కంఠ నెలకొంది

ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పాటు కావడంతో అనేక సీట్లను నేతలు త్యాగం చేశారు. దీంతో వారు తమను ఎమ్మెల్సీలుగా చేయాలని కోరుతున్నారు. తాము చేసిన త్యాగాన్ని గుర్తించాలని కోరుతున్నారు. అదే సమయంలో సామాజికవర్గాల కోటాలో తమకు అవకాశం ఇవ్వాలంటూ మరికొందరు అభ్యర్థిస్తున్నారు. ఉన్నది నాలుగు పోస్టులు.. కానీ పోటీ పడుతున్న వారి సంఖ్య నలభై మందికి పైగానే ఉంది. ఐదు స్థానాల్లో ఒకటి ఇప్పటికే జనసేనకు కేటాయించడంతో నాలుగు స్థానాలకు అభ్యర్థులను టీడీపీ అధినాయకత్వం ఎంపిక చేయాల్సి ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై ఇప్పటికే కసరత్తు చేశారు.
ఫీడ్ బ్యాక్ తీసుకుని...
పేరుకు సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నప్పటికీ, చంద్రబాబు పార్టీకి పనిచేసిన, నమ్మకంగా ఉన్నవారికి, భవిష్యత్ లో ఉపయోగపడే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారని సమాచారం. అయితే ఇప్పటికే అనేక మంది నేతలు పెద్దయెత్తున వచ్చి చంద్రబాబును, నారా లోకేశ్ ను కలసి తమ పేరును పరిశీలించాలని కోరుతున్నారు. నాలుగు స్థానాలు ఉండటంతో తమకు ఏదో ఒక కోటాలో అవకాశం దక్కుతుందేమోనని చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 10 వతేదీ చివరి తేదీ కావడంతో ఈరోజు, రేపట్లో నలుగురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించాల్స ఉంది.
ఇద్దరి పేర్లను...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం వెళ్లే ముందు కూడా కొద్దిసేపటి క్రితం దీనిపై సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిసింది. దాదాపు నాలుగు పేర్లు ఖరారయ్యాయని, ఇక అధికారికంగా ఈరోజు రాత్రికి, రేపు ఉదయం కానీ ప్రకటించే అవకాశముందని తెలిసింది. నాలుగు స్థానాల్లో ఒకటి మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు ఖరారయినట్లు చెబుతున్నారు. దేవినేని పేరు ఖరారు కావడంతో ఇక కృష్ణా జిల్లాలో మరెవరికీ ఛాన్స్ దక్కే అవకాశం లేదన్న వాదన కూడా ఉంది. కృష్ణా జిల్లాలో వంగవీటి రాధాతో పాటు బుద్దా వెంకన్న కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. నాగబాబుకు అవకాశం ఇవ్వడంతో ఇక కాపు సామాజికవర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉండదని కూడా ప్రచారం జరుగుతుంది.
ప్రాంతాల వారీగా...
బుద్ధా వెంకన్నకు ఇవ్వాలంటే ఒకే జిల్లాలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంపై కొంత సందిగ్దత నెలకొంది. దేవినేని, బుద్దా వెంకన్నలలో ఒకరికే ఇస్తారంటున్నారు. మరొక వైపు ఉత్తరాంధ్ర నుంచి కూడా ఒకరికి స్థానం కల్పించాలని చంద్రబాబు డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు మైనారిటీ వర్గాల వారు కూడా తమకు కేటాయించాలన్న వినతులను అందించడంతో దానిని కూడా పరిశీలిస్తున్నారు. ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్న యోచనలో కూడా చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ప్రాంతాలు, సామాజికవర్గాలు, సీనియారిటీ, సిన్సియారిటీ మొత్తం వెరసి నలుగురు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపిక జరగనుందని తెలిసింది.
Next Story