Wed Mar 26 2025 06:56:26 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఇంత తక్కువగానా?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. నిన్నటి వరకూ రథసప్తమికి వచ్చిన ప్రజలు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. తిరిగి నేడు తిరుమలలో వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. మాడ వీధులు కూడా బోసి పోయి కనిపిస్తున్నాయి. స్వామి వారి దర్శనం కూడా సులువుగానే లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు స్థానికులు ఎక్కువగా వస్తున్నారు.
కుంభమేళాతో...
మరోవైపు మహాకుంభమేళా జరుగుతుండటంతో ఎక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రయాగ్ రాజ్ వెళుతున్నారు. దీనివల్ల కూడా తిరుమలలో రద్దీ తగ్గిందని చెబుతున్నారు. ఈ నెల 26వ తేదీ వరకూ తిరుమలలో పెద్దగా రద్దీ ఉండదన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో పరీక్షలు కూడా దగ్గరపడుతుండటంతో భక్తులు ఈ సీజన్ లో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండదు. తిరిగి ఏప్రిల్ నెల నుంచి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముంటుంది. అయితే ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం వచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తగ్గిన హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story