Wed Oct 30 2024 07:25:50 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : వెంకటరమణా.. గోవిందా.. మము కరుణించవయ్యా?
తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. గత ఇరవై రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతూనే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. గత ఇరవై రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతూనే ఉంది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకుంటుండటంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటకిటలాడుతున్నాయి. మాడవీధుల్లోనూ భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. శుక్రవారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గినట్లు కనిపించలేదు. ఇక శని, ఆదివారాలు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
24 గంటల సమయం....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ బాట గంగమ్మ దేవాలయం వరకూ విస్తరించింది. దీంతో ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,756 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,510 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story