Tue Dec 03 2024 17:51:37 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ అంతంత మాత్రమే... దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. గురువారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని భావించినా నాలుగు రోజుల నుంచి ఇంతే
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. గురువారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని భావించినా గత నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం భారీ వర్షాలు. అన్ని రకాలుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోవడంతో ప్రజలు తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే భారీ వర్షాల కారణంగా దాదాపు 594 రైళ్లను రద్దు చేసింది. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు బస్సులు తిరుగుతున్నప్పటికీ మరో అల్పపీడనం పొంచి ఉందన్న వాతావరణ వాఖ హెచ్చరికలు ప్రజలు తిరుమలకు వచ్చేందుకు జంకుతున్నారు. తిరుమలకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతున్నామన్న ఆందోళనతో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు కూడా తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతోనే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఎనిమిది గంటల్లో...
అతి భారీ వర్షాలు కురవడంతో పాటు వరదలు కూడా వస్తాయన్న హెచ్చరికలతో ప్రజలు తిరుమల పర్యటనకు పెద్దగా రావడం లేదు. కేవలం రాయలసీమ జిల్లాల నుంచి మాత్రమే తిరుమలకు భక్తులు ఎక్కువగా చేరుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో దర్శనమవుతుంది. నిన్న తిరుమలకు 57,390 మంది భక్తులు చేరుకున్నారు. వీరిలో 20,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story