Mon Dec 23 2024 23:57:42 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ కు ఇంకా సమయం ఉంది.. అప్పుడే తొందర పడుతున్నారా?
వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఇంకా బోలెడంత సమయం ఉంది.
వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఇంకా బోలెడంత సమయం ఉంది. దాదాపు 59 నెలల సమయం ఉంది. అయితే ముందుగానే ఆయన ఏం మాట్లాడినా పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. దానికి ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టంకట్టారు. ఇచ్చిన హామీలు కూడా అలాగే ఉన్నాయి.వాటిని అమలుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 23 రోజులు కూడా కాలేదు. అప్పుడే హామీలు అమలు చేయలేదని అనడాన్ని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకే కొంత గ్యాప్ ఇవ్వడం బెటర్ అన్నది అందరూ అంగీకరించే విషయమే.
యాగీ చేసినా...
ఇప్పుడు అరిచి గోల చేసినా, యాగీ చేసినా ఫలితం ఉండదు. ప్రజల నుంచి కూడా అప్పుడే మద్దతు కూడా లభించకపోవచ్చు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా కుదురుకోకముందే ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయాలని అనడం గొంతుమీద కూర్చుని నొక్కడమేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రభుత్వం తప్పులు చేసే వరకూ సమయం ఇవ్వాలి. అంతకు ముందు మీడియా ఎదుటకు వచ్చి విమర్శలకు కూడా ప్రతి విమర్శలు చేయని జగన్ ఇప్పుడు మైకుల ఎదుట మాట్లాడుతుండటాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసినా అది అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా సూటిగా తగిలే అవకాశం లేదు.
ఎదురుచూస్తున్న జనం...
ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం కావచ్చు. రైతు భరోసా నిధులు కావచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మహిళలకు 2,500 రూపాయలు నెలకు ఇవ్వడం కానీ, నిరుద్యోగ భృతి అయినా ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. అయితే ప్రభుత్వం ఊపిరి తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విమర్శలు చేసినా ప్రతి విమర్శలు గత ప్రభుత్వంపైనే ఈ ప్రభుత్వం చేసే వీలుంది. గత ప్రభుత్వం అన్నీ విధ్వంసం చేసిందని ఇప్పటికే శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేస్తూ కొంత జనం మైండ్స్ ను సెట్ చేసుకుంటూ వెళుతున్నారు.
ఇప్పడు విమర్శలు చేసినా...
జగన్ విమర్శలు చేసినా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికే ఇబ్బందిగా మారిందని ఎదురుదాడికి దిగుతారు. అంతేకాదు.. మీడియా మద్దతు కూడా పెద్దగా లేని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ అంతకంటే ఏం చేయలేని పరిస్థితి. అలాగని మౌనంగా ఉండమని కాదు కానీ, అప్పుడే దూకుడుగా వెళ్లినంత మాత్రాన అధికార పార్టీకి వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదని తెలుసుకోవాలి. ఇంకా చాలా రోజుల సమయం ఉంది. అధికారపార్టీకి మంచి పనులు చేస్తూ కొన్ని తప్పులు కూడా చేయక మానదు. అప్పుడప్పుడు ఎండగడుతూ వెళుతుంటే కొంత జనం విశ్శసిస్తారు. అంతే తప్పించి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతుందని శాపనార్థాలు పెట్టినా ప్రయోజనం లేదు. క్యాడర్ ను కాపాడుకోవడానికి అధికార పార్టీపై విమర్శలు చాలవు. వారి దగ్గరకు వెళ్లి తాను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. అప్పుడే క్రమంగా బలం పుంజుకునే వీలుంటుంది.
Next Story