Sat Jan 04 2025 02:21:45 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ పనిచేస్తున్నారా? అసలు ఆలోచన అదేనట
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు దర్శకత్వంలోనే పనిచేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరొకలా కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నడుచుకుంటూ తన పార్టీని పణంగా పెడుతున్నారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు అయితే ఒక విధంగా పవన్ కల్యాణ్ ను ఆయన అభిమానులు, సామాజికవర్గం ఊహించుకుంది. కానీ ఇంతలా తగ్గుతారని మాత్రం పవన్ విషయంలో అంచనా వేయలేదు. అంతా చంద్రబాబు దర్శకత్వంలోనే పనిచేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇతరపార్టీల నుంచి చేరుతున్న నేతల విషయంలోనూ చంద్రబాబు సూచనల మేరకే కండువాలు కప్పుతున్నారన్న కామెంట్స్ మాత్రం జనసేన పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి.
ప్రత్యర్థిని బలహీన పర్చాలంటే...
ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి నుంచి నిన్న మంగళగిరి నియోజకవర్గ నేత గంజి చిరంజీవి వరకూ తన పార్టీలో చేర్చుకోవడం వెనక చంద్రబాబు నాయుడు ఆలోచన ఉందని చెబుతున్నారు. అక్కడ వైసీపీని బలహీనం చేయాలన్న ఆలోచనతో తాను నేరుగా చేర్చుకోవడానికి చంద్రబాబుకు ఇబ్బందులున్నాయి. సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తారు. అలాగని వైసీపీ అక్కడ వచ్చే ఎన్నికల్లోనూ బలంగా ఉండకూడదు. అయితే అదే సమయంలో ఆ నేతలు కూడా వైసీపీలో కొనసాగకూడదు. ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన. అందుకే తన పార్టీలోకి నేరుగా చేర్చుకోలేని నేతలను జనసేన వైపునకు పంపుతున్నారన్న కామెంట్స్ పార్టీలో వినపడుతున్నాయి.
బలమైన నేతలను లాగేసి...
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను చేరిక విషయంలోనూ ఇదే జరిగిందని చెబుతున్నారు. జగ్గయ్యపేటలో బలమైన నేత ఉదయ భాను కావడంతో అతనిని జనసేనలోకి పంపితే తమకు వచ్చే ఎన్నికల్లో ఎలాగూ రాజకీయంగా ఇబ్బందులుండవన్న అంచనాలతో ఈ పనిచేశారంటున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యనేత గంజి చిరంజీవిని కూడా జనసేనలోకి పంపింది చంద్రబాబేనన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే మంగళగిరిలో నారా లోకేష్ కు మరింత పట్టు పెంచాలంటే గంజి చిరంజీవిని తమలో కలుపుకోవాలి. అయితే తన పార్టీలోకి నేరుగా చంద్రబాబు తీసుకోలేరు. అందుకే గంజి చిరంజీవిని జనసేనలోకి పంపి మంగళగిరిలో లైన్ క్లియర్ చేశారంటున్నారు.
టిక్కెట్ విషయంలో...
జనసేనలో చేరే ప్రతి చేరిక వెనక చంద్రబాబు ఆలోచన ఉంటుందని చెబుతున్నారు. రేపు తమ్మినేని సీతారాం కూడా జనసేనలో చేరితే అది చంద్రబాబు డైరెక్షన్ అన్న కామెంట్ వినపడుతుంది. ఇప్పుడు జనసేనలో చేరిన నేతలు ఎవరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే అవకాశం లేదు. అక్కడ టీడీపీ నేతలే పోటీ చేస్తారు. ఒకవేళ నియోజకవర్గాల పెంపు జరిగి అక్కడ సానుకూలత ఉంటే తప్ప వీరికి టిక్కెట్ దక్కే అవకాశం లేదు. జనసేన కోటాలో చేరిన వారికి టిక్కెట్ దక్కకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే సమయంలో టీడీపీ విజయానికి ఢోకా ఉండదు. ఈ ప్లాన్ లోనే చంద్రబాబు పవన్ కల్యాణ్ ద్వారా అమలు చేస్తున్నారని, అందుకోసమే పవన్ కు ఇష్టం లేకపోయినా కొందరిని చేర్చుకుంటున్నారని పార్టీలో ముఖ్యనేతలే చెబుతుండటం విశేషం.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story