Mon Dec 23 2024 12:45:56 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో టెన్షన్ .. టెన్షన్
కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు
కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పేందుకు వెళుతుండగా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో శాంతిపురంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వందల మంది పోలీసులు మొహరించి చంద్రబాబు వద్దకు వెళుతుండగా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కార్యకర్తలను అడ్డుకోవడంతో...
కేకుమానుపల్లిలో చంద్రబాబు ప్రసంగించడం కోసం ఏర్పాటు చేసిన వేదికను పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను కార్యకర్తలు ఎత్తిపడేయడంతో పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి మరికాసేపట్లో రాబోతున్నారు. పరిస్థితి మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు కుప్పంకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
Next Story