Thu Jan 16 2025 19:40:04 GMT+0000 (Coordinated Universal Time)
Capital Amaravati : రాజధాని అమరావతిలో భూముల ధరల పెరుగుదలో నిజమెంత?
రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయన్న ప్రచారంలో నిజమెంత అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయన్న ప్రచారంలో నిజమెంత అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భూముల ధరలు పెరిగిపోయాయని విపరీతమైన క్యాంపెయిన్ జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజధాని నిర్మాణం పూర్తికానుండటంతో ఇక్కడ భూముల ధరలు మరింత ప్రియమవుతాయని భావించి ఎగబడి కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలపై చాలా మందికి అనేక సందేహలున్నాయి.
ప్రభుత్వం మారిన వెంటేనే...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే భూముల ధరలపై కొంత వరకూ ఎంక్వైరీలు జరుగుతుండటం మాత్రం నిజం. గతంతో పోలిస్తే భూముల ధరలపై ఆరా తీసే వారి సంఖ్య పెరిగిందన్నది కూడా వాస్తవమే. కానీ భూములను కొనుగోలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రాకపోవడం కూడా అంతే నిజమంటున్నారు స్థానికులు. కేవలం భూముల ధరలను ఆరా తీసి వెళుతున్నారు తప్పించి కొనుగోలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. అయితే ఇందుకు మూఢమి కూడా ఉండటం ఒక కారణంగా చెబుతున్నారు. మూఢమి వెళ్లిపోయిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరిగే అవకాశముందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు...
మరోవైపు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సృష్టిన్తున్న బూమ్ అని మరికొందరు వాదిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కొత్త ప్రభుత్వం మాత్రం రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తుండటంతో రానున్న కాలంలో ధరలు పెరుగుతాయని మాత్రం రియల్ వ్యాపారులు చెప్పి భూముల విక్రయాలకు సిద్ధమవుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా అదే బాటలో ఉన్నారు. మొన్నటి వరకూ పనిలేకుండా ఉన్న ఏజెంట్లు ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే కమీషన్ల కోసం ధరలు పెంచుతున్నారని కూడా చెబుతున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. గతంలో నిలిచిపోయిన అపార్ట్మెంట్ల నిర్మాణాలు కూడా ఇప్పుడు ప్రారంభమయ్యాయి. అయితే భూమిని, ఇంటిని కొనేవారు స్థిరాస్థిని పెరిగే చోట మాత్రమే కొనుగోలు చేయాలంటారు. కోట్లు పోసి కొనుగోలు చేసి తర్వాత పెరగకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.
మధ్యతరగతి, ఉద్యోగులు...
లక్షలు పోసి, బ్యాంకు రుణాలు తీసుకుని కొనుగోలు చేసే మధ్యతరగతి, ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ ధరలు పడి లేచే చోట పెట్టుబడి పెట్టడానికి సహజంగా ఇష్టపడరు. ఎందుకంటే తాము కష్టపడి కొనుగోలు చేసిన ఆస్తి ధర పెరగకపోతే ఆర్థికంగా చితికి పోతారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండే మాట నిజం. తర్వాత ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే అప్పుడు ఈ ధరలు ఉంటాయా? ఇదే బూమ్ కొనసాగే అవకాశాలుంటాయా? అని ఆలోచించి పెట్టుబడి పెట్టడానికి కూడా ఒకింత ఆలోచిస్తున్నారని విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు చెప్పారు. అంటే ఇప్పుడు ధరలు పెరగడం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు సృష్టించిన ప్రచారమేనని, మరికొంత కాలం ఆగి, ప్రభుత్వం చేసే పనులను చూసి ధరల పెరుగుదల వాస్తవానికి దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద ఇప్పుడు అమరావతిలో భూములు కొనుగోలు చేసే వారు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులే తప్ప అవసరానికి ఉపయోగపడుతుందని కొనే మధ్యతరగతి, ఉద్యోగులు మాత్రం కాదన్నది వాస్తవం.
Next Story