Mon Nov 18 2024 02:21:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఫోన్ మోగింది... సీటు చిరిగింది.. కల చెదిరింది.. 21 చోట్ల మార్పులు
వైసీపీలో మూడో జాబితా విడుదలయింది. 23 మంది అభ్యర్థులతో మూడో జాబితాలో ఖరారు చేశారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడో జాబితా విడుదలయింది. 21 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. గెలుపు ఆధారంగానే ఇన్ఛార్జుల నియామకం చేపడుతున్నట్లు వైసీపీ అధినాయకత్వం చెబుతుంది. ప్రతి రోజూ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించడం, ఎందుకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పడంతో వారిని పక్కన పెడుతుంది. కొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతుండగా, మరికొందరు ఆవేశంతో అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయినా సరే ఏ మాత్రం ఖాతరు చేయకుండా వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ముఖ్యమంత్రి జగన్ నిమగ్నమయి ఉన్నట్లు కనిపిస్తుంది.
రెండు విడతల్లో...
తొలి విడతలో పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమించగా, రెండో జాబితాలో 28 స్థానాలకు నియమించారు. వీరిలో పదహారు మంది కొత్త వారు ఉండటం విశేషం. సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఓడించగలిగే సత్తా ఉన్న వారినే ఇన్ఛార్జులుగా నియమిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. తన, మన అనేది లేదు. కేవలం ఒక సామాజికవర్గమే కాదు. అన్ని స్థానాల్లోనూ ప్రత్యేకంగా నిర్వహించిన సర్వే నివేదికలను అనుసరించి ఈ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల వరకూ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒక రోజుతో ముగిసే కార్యక్రమం కాదని కూడా చెబుతున్నారు.
బంధువులను సయితం...
మంత్రులను కూడా పక్కన పెట్టేస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారికి సయితం స్థాన చలనం తప్పడం లేదు. బంధు వర్గం విషయంలో కూడా జగన్ రాజీ పడే ప్రసక్తి లేదన్న సంకేతాలను నేతలకు పంపుతున్నారు. ఉన్నవాళ్లే తన వాళ్లని, వెళ్లే వాళ్లు వెళ్లిపోయినా తమకు అభ్యంతరాలు ఏవీ ఉండవని కూడా గట్టి సిగ్నల్స్ ఇస్తున్నారు. దీంతో క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చిందంటే చాలు తమ సీటు చిరిగిపోయినట్లేనని భావిస్తున్నారు. మరొక చోటకు వెళ్లేందుకు ఇష్టం లేక, ఇక్కడ ఇమడలేక కొందరు నేతలు ఐదేళ్ల పాటు రాజకీయంగా దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకోవడమే మంచిదన్న భావనకు కొందరు వచ్చినట్లు తెలిసింది.
మూడో జాబితా ఇదే
రాయదుర్గం - మెట్టు గోవిందరెడ్డి
చింతలపూడి - కంభం విజయరాజు
ఇచ్ఛాపురం - పెరియా విజయ
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు - సునీల్ కుమార్
చిత్తూరు - విజయానంద రెడ్డి
మదనపల్లి - నిస్సార్ అహ్మద్
రాజంపేట - ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి
ఆలూరు - విరూపాక్ష
కోడుమూరు - డాక్టర్ సతీష్
గూడూరు - మేరుగ మురళి
సత్యవేడు - డాక్టర్ గురుమూర్తి
పెడన - ఉప్పాల రాము
పెనమలూరు - జోగి రమేష్
పార్లమెంటు నియోజకవర్గాలు...
శ్రీకాకుళం పార్లమెంటు - పేరాడ తిలక్
విజయవాడ పార్లమెంటు - కేశినేని నాని
తిరుపతి పార్లమెంటు - కోనేటి ఆదిమూలం
విశాఖ పార్లమెంటు - బొత్స ఝాన్సీ
కర్నూలు పార్లమెంటు - గుమ్మనూరు జయరాం
ఏలూరు పార్లమెంటు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
Next Story